రెండు రోజులుగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు రహదారుల పరిస్థితి దయనీయంగా మారింది. తిప్పర్తి మండల కేంద్రంలో వరద ధాటికి ఓ పెట్రోల్ బంక్ ముందున్న రోడ్డు కోతకు గురికాగా.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా. హైదరాబాద్, గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ లాంటి పట్టణాలకు వెళ్లే వారికి ఇదే ప్రధాన మార్గం కావటం వల్ల ప్రయాణికులు నానా తంటాలు పడుతున్నారు.
వర్షంతో రోడ్లు ధ్వంసం... ప్రయాణికులకు తప్పని నరకం
నల్గొండ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఎక్కడపడితే అక్కడ గుంతలు పడి ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. వరద ప్రవాహం ఉండటం వల్ల ఎక్కడ గుంత ఉందో తెలియక వాహనదారులు వణికిపోతున్నారు.
రెండు రోజులుగా.. ఇలాగే ఇబ్బందులు పడుతూ వెళుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. టోల్గేట్ సిబ్బంది తాత్కాలిక మరమ్మతుల నిమిత్తం గుంతల్లో కంకర పోసినప్పటికీ... వరద భారీగా రావటం వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. ఇక బస్టాండ్ ఆవరణలో ఎటు చూసినా గుంతలు కావటం వల్ల... ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడప్పుడు తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం ఉండటం లేదు. అధికారులు వెంటనే చొరవ చూపి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.