తెలంగాణ

telangana

ETV Bharat / state

మునుగోడు ఉపఎన్నికల్లో ఏరులైన మద్యం.. రికార్డు స్థాయిలో మాంసం అమ్మకాలు - మునుగోడు ఉపఎన్నికల్లో ఏరులైన మద్యం

munugode bypoll: మునుగోడు ఉపఎన్నిక ప్రచారంతో మద్యం ఏరులై పారుతుండగా మాంసం అమ్మకాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. మద్యం అమ్మకాలు పెరగడంపై.. ఇప్పటికే ఎన్నికల అధికారులు దృష్టి సారించారు. నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు చేస్తున్న ఖర్చుతో.. కొత్తగా చిల్లర సమస్య నెలకొంది. చిన్న నోట్లు లభ్యం కాక.. వ్యాపారులు నానా తంటాలు పడుతున్నారు. ఇక నియోజకవర్గానికి ప్రధాన పార్టీలు.. ప్రచారం కోసం ఏపీ నుంచి యువకులను రప్పించి జనసమీకరణ చేస్తున్నట్లు సమాచారం.

munugode bypoll
munugode bypoll

By

Published : Oct 26, 2022, 12:15 PM IST

మునుగోడు ఉపఎన్నికల్లో ఏరులైన మద్యం.. రికార్డు స్థాయిలో మాంసం అమ్మకాలు

munugode bypoll: మునుగోడు ఉపఎన్నిక సమీపిస్తున్న కొద్దీ.. రాజకీయ వేడి మరింత రాజుకుంటోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు.. ఖర్చుకు ఏ మాత్రం వెనకడుగేయడం లేదు. నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలో 22 రోజుల వ్యవధిలో 160.8 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినట్లు అబ్కారీ శాఖ లెక్కకట్టింది.

తొలి పది రోజుల్లోనే 70.7 కోట్ల రూపాయలు అమ్మకాలు జరగగా.. ఇప్పటి వరకు ఒక్క మునుగోడు మండలంలోనే 38.19 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరగడం విశేషం. గతంలో సాధారణంగా నల్గొండ జిల్లాలో మొత్తం నెల రోజుల్లో సగటున 132 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగేవి. ప్రస్తుతం ఒక్క మునుగోడులోనే అదీ 20 రోజుల్లోనే అంతకు రెట్టింపుగా అమ్మకాలు జరిగాయి.

నియోజకవర్గ పరిధిలోని మొత్తం 28 మద్యం దుకాణాలుండగా.. అత్యధికంగా మునుగోడులో, అత్యల్పంగా గట్టుప్పల్‌లో అమ్మకాలు జరిగినట్లు అబ్కారీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. నేటి నుంచి ప్రచార పర్వం మరింత హోరెత్తనుండటంతో.. నెల ముగిసే నాటికి 230 కోట్ల రూపాయలకు పైగా ఒక్క మునుగోడులోనే ఆదాయం ప్రభుత్వానికి చేకూరనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మద్యం అమ్మకాలతో జోరు: మద్యం అమ్మకాలు జోరుగా సాగుతుంటే.. నల్గొండ, నకిరేకల్‌ నియోజకవర్గాల్లో ఉన్న డిపోల నుంచి మాత్రం మద్యం సాధారణం కంటే కొంచెం ఎక్కువగా సరఫరా అవుతోందని, అధికారులు వెల్లడించిన గణాంకాలంత ఇక్కడి నుంచి మునుగోడుకు సరఫరా చేయడం లేదని.. డిపో వర్గాల ద్వారా తెలుస్తోంది.

మునుగోడు నియోజకవర్గంలోని పలు మద్యం దుకాణాల్లోనూ అమ్మకాలు సాధారణంగానే ఉంటున్నాయని సమాచారం. దీంతో ఇంత పెద్ద ఎత్తున మద్యం ఎక్కడి నుంచి సరఫరా అవుతుందన్నది... అంతుచిక్కని ప్రశ్నగా తేలింది. కొంత మంది హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలతో పాటూ... ఇబ్రహీంపట్నం, దేవరకొండ నుంచి విచ్చలవిడిగా నియోకజవర్గంలోని పలు బెల్ట్‌దుకాణాలకు సరఫరా చేస్తున్నారని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి.

గణాంకాలు మాత్రం పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయని సూచిస్తుండగా.. డిపోల్లో అమ్మకాలు మాత్రం సాధారణంగా ఉండటం అబ్కారీ శాఖలో అక్రమాలు జరగుతున్నాయనడానికి.. నిదర్శనంగా ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. దీంతో ఎన్నికల పరిశీలకుల ఆదేశంతో పాటూ మద్యం దుకాణాల్లో అమ్మకాల పరిస్థితిని... జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు వినయ్‌కృష్ణారెడ్డి మంగళవారం పలు మద్యం దుకాణాలను పరిశీలించి... వివరాలను అడిగి తెలుసుకున్నారు.

మాంసం ఖర్చు 50 కోట్ల రూపాయలు: ఇక మాంసం విషయానికి వస్తే... ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ వినియోగం గరిష్టస్థాయికి చేరింది. ఇప్పటి వరకు అన్ని గ్రామాల్లో కలిపి ఒక్క మాంసానికే ప్రధాన పార్టీలు సుమారు 50 కోట్ల రూపాయల వరకు ఖర్చుపెట్టాయని తెలిసింది. ప్రచార పర్వంలోనే దసరా, దీపావళి పండుగలు రావడమూ మాంసం వినియోగం మరింత పెరగడానికి కారణంగా తెలుస్తోంది.

చిల్లర, టోకు దుకాణాల వద్ద.. సాధారణంతో పోలిస్తే సుమారు ఐదింతల వ్యాపారం పెరిగింది. ప్రతి గ్రామంలోనూ వివిధ పార్టీ నాయకులు ప్రచారం నిమిత్తం మకాం వేయడంతో అక్కడికి వచ్చే పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలందరికీ చికెన్, మటన్‌తోనే వడ్డిస్తున్నారు. మునుగోడు మండలంలోని 1600 ఓట్లున్న ఓ గ్రామంలో గత 20 రోజుల నుంచి సుమారు 80 మేకలు, గొర్రెలను పార్టీ నాయకులకు వడ్డించడానికి వధించారు.

దీనికి అదనంగా చికెన్‌ తెప్పిస్తున్నారు. చౌటుప్పల్‌ మండలంలో ఓ ప్రధాన పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు ఇన్‌ఛార్జ్‌గా ఉండటంతో అక్కడ గత 20 రోజుల నుంచే... సుమారు 120 వరకు మేకలను మాంసం కోసం వధించినట్లు సమాచారం. దీనికి అదనంగా రోజూ 100 కిలోల వరకు చికెన్‌ను తెప్పించి గ్రామంలోని అందరికీ మాంసంతోనే మధ్యాహ్నం, రాత్రి భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు. నల్గొండ, దేవరకొండ, నకిరేకల్, నాగార్జ్జునసాగర్‌తో పాటూ.. నాగర్‌కర్నూల్‌ జిల్లా నుంచి నిత్యం నియోజకవర్గానికి సుమారు 30 నుంచి 40 DCMలలో మేకలు వస్తున్నాయని సంబంధిత పశుసంవర్థక శాఖ అధికారులు వెల్లడించారు.

చిల్లర సమస్య: ప్రచారంలో కార్యకర్తలు, ముఖ్యనాయకులతో పాటూ వ్యాపారులు, ఇతర చిన్నా చితకా వ్యాపారులకు ప్రస్తుతం కొత్త కష్టమొచ్చి పడింది. అదే చిన్న నోట్ల సమస్య. నియోజకవర్గంలోని మొత్తం 298 బూత్‌ల్లో ప్రతి బూత్‌లో ప్రధాన పార్టీలన్నీ 40 నుంచి 50 మంది కార్యకర్తలతో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రధాన పార్టీలతో పాటూ చిన్న పార్టీలు, స్వతంత్రులు సైతం నిత్యం తమ శక్తి మేర ప్రచారానికి ఖర్చుపెడుతున్నారు.

క్షేత్రస్థాయిలో వీరికి రోజుకు సుమారు 3 కోట్ల రూపాయల వరకు అన్ని పార్టీలు చెల్లింపులు చేస్తున్నాయి. వాహనాల డ్రైవర్లు, అనుచరుల ఖర్చులు, వంట సామాన్లు, వంటవారు.. ఇతరత్రాలకు వెచ్చించే మొత్తం అదనం. ఈ చెల్లింపులన్నింటినీ 500 రూపాయల నోట్లలోనే చేస్తుండటంతో.. మండల కేంద్రాల నుంచి గ్రామ స్థాయి వరకు 10, 20, 50 రూపాయల నోట్లకు కటకట అవుతోంది.

ఉదయం టీ దుకాణం నుంచి టిఫిన్‌ సెంటర్లు, కిరాణా దుకాణాలు, భోజన హోటళ్లు, చివరకు మద్యం దుకాణాల్లోనూ చిల్లర సమస్యతో, వారు బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి నెలకొంది. డిజిటల్‌ లావాదేవీలు చేసేందుకు.. మాత్రం వినియోగదారులు సుముఖత వ్యక్తం చేయట్లేదని వ్యాపారులు చెబుతున్నారు.

వివిధ ప్రాంతాల నుంచి మునుగోడుకు: ఓ ప్రధాన పార్టీ 20 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్న యువకులను వివిధ ప్రాంతాల నుంచి మునుగోడుకు రప్పిస్తోందని సమాచారం. ఆంధ్ర, రాయలసీమ నుంచి నల్గొండ మీదుగా హైదరాబాద్‌కు నిత్యం ఉదయం వచ్చే రైళ్లలో రోజూ 200 మంది యువకులు నల్గొండ స్టేషన్‌లో దిగుతున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

వీరికి రోజూ 500 రూపాయలు ఇచ్చి రెండు పూటలా భోజనం పెడుతున్నట్లు సమాచారం. వీరెక్కడా మాట్లాడరు. ముఖ్య నేతల ప్రచార గుంపులో ఉంటారు. ఇలా వచ్చిన వారిలో కొంత మందిని మాత్రమే మేం ప్రచారానికి వాడుకుంటున్నామని.. ఓ మండల స్థాయి నేత వెల్లడించారు. వీరిని రప్పించడానికి, ప్రత్యేకంగా బృందాలను నియమించుకున్నట్లు తెలిసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details