వీళ్లు మహా ముదుర్లు.. రహదారులనూ అమ్మేస్తున్నారు! నల్గొండ జిల్లా మిర్యాలగూడ పరిధిలోని ఈదులగూడెం కూడలి నుంచి ఖమ్మం వైపు వెళ్లే ప్రధాన రహదారి వెంబడి... 1994 జులై 20న 473,474,468,477 50 సర్వే నెంబర్లలోని 50 ఎకరాల విస్తీర్ణంలో డీటీసీపీ అనుమతితో శివప్రియ నగర్ పేరుతో వెంచర్ వేశారు.
లే అవుట్ నిబంధనల ప్రకారం పార్కు, నీటి ట్యాంకు, 60, 30 అడుగుల వెడల్పు రహదారులు ఏర్పాటుకు స్థలం కేటాయించి మున్సిపాలిటికీ అప్పగించారు.
అప్పట్లో ప్రత్యేకంగా పట్టణ ప్రణాళిక విభాగం లేకపోగా... అధికారులకు నమూనాలతో స్థలాన్ని అప్పగించారు. 1995 నుంచి 1999 వరకు ప్లాట్లు కొనుగోలు చేసినవారికి... 1999లో అందరికీ రిజిస్ట్రేషన్లు చేశారు.
ఇరవై ఏళ్లపాటు రహదారులు మున్సిపాలిటీ ఆధీనంలోనే ఉన్నాయి. ఇక్కడ అరకొర నివాసాలు ఏర్పాటు చేసుకోగా... 2018లో మిషన్ భగీరథ నీటి ట్యాంకులు నిర్మించారు.
20 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన వెంచర్ కావడం వల్ల కొందరు అక్రమార్కులు తమదైన శైలిలో కొన్నేళ్లుగా అక్రమ రిజిస్ట్రేషన్లకు తెరతీశారు.
వెంచర్ మధ్యలో రహదారిని మూడేళ్ల క్రితం స్థానిక నాయకుడు విక్రయించాడు. ఇప్పటికీ ఈ స్థలం ముగ్గురు చేతులు మారింది. ప్లాట్ నెంబరు 447, 446, 445కు ఎదురుగా ఉన్న పడమర రహదారి 30 అడుగులు ఉండగా దీనిని ఇటీవల కొందరు వ్యక్తులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు.
స్థలాలు కొనుగోలు చేసిన వారు రహదారికి అడ్డంగా గుంతలు తవ్వారు. దీంతో సంబంధిత ప్లాట్ల వారు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.
పురపాలక అధికారులు దృష్టి సారిస్తే మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉందని బాధితులు వేడుకుంటున్నారు. ఇకనైనా మున్సిపల్ అధికారులు మేల్కొని పురపాలిక స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడాలని, అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేయాలని పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి:విద్యా సంవత్సరం ఖరారయ్యాకే సర్కారు మార్గదర్శకాలు