తెలంగాణ

telangana

ETV Bharat / state

పొలం ప్లాట్‌గా మారింది.. అయినా ఖాతాలోకి రైతుబంధు.! - latest news of raitu bandhu funds

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడికి గాను సీజన్​కు ఎకరానికి రూ. 5000 అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తుంది. పంట పొలాలు ప్లాట్లుగా మార్చినప్పటికీ రెవెన్యూ సిబ్బంది రికార్డుల్లో మార్పులు చేయకపోగా... వాటిని పంట పొలాలుగానే చూపుతున్నారు. దీనితో గతంలో పొలం ఉన్న వారి పేరిటే ఏటా రైతు బంధు డబ్బులు జమ అవుతున్నాయి. మిర్యాలగూడ డివిజన్ పరిధిలో జాతీయ, రాష్ట్ర రహదారులు విస్తరిస్తుండడం వల్ల పంటపొలాలను రియల్టర్లు కొనుగోలు చేసినా రైతుల ఖాతాలో ఇంకా పథకం డబ్బు జమ అవుతున్న తీరు తాజా వెలుగుచూసింది.

raitu bandhu funds will also be credited to the farmer's account then he sold the farm in nalgonda
పొలం అమ్మినా రైతు ఖాతాలో రైతుబంధు నిధులు ఎలా..!

By

Published : Jul 19, 2020, 2:53 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అద్దంకి-నార్కట్ పల్లి ప్రధాన రహదారి వెంబడి గూడూరు గ్రామ పరిధిలో 100 ఎకరాలు వరకు ప్లాట్లుగా మార్చిన పొలాలకు రైతు బంధు జమ అవుతుంది. సర్వే నెంబర్ 396లో పంట పొలాలను 2008లో రియల్ ఎస్టేట్ వారు ప్లాట్లు చేసి విక్రయించారు. ఈ సర్వే నెంబర్లలో గతంలోని రైతులకు రైతుబంధు ఈ ఏడాది సైతం జమ అయ్యింది. పట్టణంలోని డంపింగ్ యార్డ్ సమీపంలో 32 సర్వే నెంబర్​లో 8 ఎకరాల భూమి పదేళ్ల క్రితం అమ్మినప్పటికి సదరు రైతులకు ఈ ఏడాది రైతుబంధు ఖాతాలో జమ అయింది. ఇలానే అవంతిపురం గ్రామ పరిధిలో 60 ఎకరాలు, శ్రీనివాస్ నగర్ పరిధిలో 50 ఎకరాలు, వెంకటాద్రిపాలెం 40 ఎకరాలు, ప్లాట్లుగా మార్చినా ఇప్పటికీ రైతుబంధు జమ అవుతున్నది.

రహదారులకు ఇరువైపుల ఉన్న పొలాలే ఎక్కువ

గూడూరు, కొత్తగూడెం, దామరచెర్ల, బొత్తలపాలెం, వాడపల్లి, కొండప్రోలు, కోదాడ, జడ్చర్ల జాతీయ రహదారి వెంబడి వెంకటాద్రిపాలెం, శ్రీనివాస్ నగర్, తుంగపాడు, త్రిపురారం, నిడమనూరు, హాలియా, పెద్దవూర, వేములపల్లిలలో వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లుగా మార్చి విక్రయాలు జరిపారు. ఇక్కడి రైతులకు ఎంత మందికి ఇంకా రైతు బంధు సొమ్ము జమ అవుతుందనేది అధికారులు తేల్చాల్సి ఉంది.

వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చే క్రమంలో నాలా మార్పిడి చేసిన వాటిని రికార్డుల నుంచి తొలగించేలా చూస్తామని మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ తెలిపారు. ప్లాట్లు ఉన్న చోట రైతుబంధు జమచేసిన విషయమై పరిశీలించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:-'కరోనా వేళ ఎన్నికల నిర్వహణకు సూచనలు ఇవ్వండి'

ABOUT THE AUTHOR

...view details