రైతులను సంఘటితం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు వేదికలను దశలను వారీగా ప్రారంభించేందుకు సన్నాహకాలు ప్రారంభం అయ్యాయి. సిద్ధంగా ఉన్న రైతు వేదికలను వెంటనే ప్రారంభించాలంటూ.. మూడు రోజుల క్రితమే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. ఈ క్రమంలో దశలవారీగా ప్రారంభించేందుకు జిల్లాల అధికారులు సమాయాత్తమవుతున్నారు. రానున్న వారం రోజుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వీటిని అందుబాటులో ఉంచనున్నారు. సూర్యాపేట జిల్లా మునగాలలో రైతు వేదిక మొదలుకాగా... మిగతా చోట్ల సైతం ప్రారంభం కానున్నాయి.
రైతన్నకు తోడుగా
గతేడాది మే 21న ప్రగతిభవన్‌లో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి... రైతు వేదికల బాధ్యతలను జిల్లాల రైతు బంధు సమితి అధ్యక్షులకు అప్పగించారు. వ్యవసాయ విస్తరణాధికారి పరిధిని క్లస్టర్‌గా తీసుకున్నారు. ప్రతి ఏఈవో పరిధిలో 5 వేల ఎకరాల వ్యవసాయ భూములు ఉండాలని నిర్దేశించారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో మొత్తం... 314 రైతు వేదికలు రూపుదిద్దుకున్నాయి. ఆరుగాలం కష్టపడుతున్న సాగుదారుకు ఒక వేదిక, ఐక్యత లేవంటూ... నేరుగా వారి వద్దకే శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు వచ్చి సూచనలు ఇచ్చేలా ఈ వేదికలు ఉండాలని కేసీఆర్ భావించారు.