RAINS: తడిసి ముద్దయిన నీలగిరి పట్టణం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నల్గొండ పట్టణం తడిసి ముద్దయింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి చిరుజల్లులు నిరంతరాయంగా కురవడంతో మురుగు కాల్వలు పొంగి పొర్లాయి. రోడ్లు వరద నీటితో నిండిపోయాయి. అంతర్గత రోడ్లు చిత్తడిగా మారాయి. పానగల్ చౌరస్తాలో భారీగా చేరిన నీటితో వాహనదారులు, పట్టణవాసులు కష్టాలు పడ్డారు. పట్టణంలో ప్లైఓవర్ నుంచి పానగల్ బైపాస్ వరకు మురుగునీరు రోడ్లపై పారడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా.. సిబ్బంది సరఫరా పునరుద్ధరణ పనులు చేపట్టారు.
జిల్లావ్యాప్తంగా..
నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకలు జలకళను సంతరించుకొన్నాయి. రహదారులు చిత్తడిగా మారడంతో గ్రామీణ ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. పైర్లకు జీవం పోసినట్లు అయింది. ఇన్ని రోజులుగా సరైన వానలు లేక దిగాలుగా ఉన్న రైతన్నలు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలో మంగళవారం 54.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. త్రిపురారంలో 5.5 మి.మీ., కేతేపల్లిలో 4.9, నకిరేకల్, దామరచర్లలో 4.5, గుండ్లపల్లిలో 4.1, నిడమనూర్‌లో 3.8, శాలిగౌరారంలో 3.6, చందంపేటలో 3.2, నల్గొండలో 2.2, తిప్పర్తిలో 2.1, కట్టంగూర్, అడవిదేవులపల్లిలో 2.0, పీఏపల్లిలో 1.8, అనుములలో 1.7, నార్కట్‌పల్లిలో 1.6, మిర్యాలగూడలో 1.4, కొండమల్లేపల్లిలో 1.3, మాడుగులపల్లిలో 1.0, పెద్దవూర, దేవరకొండలో 0.7, నేరెడుగొమ్ములో 0.5, మునుగోడు, వేములపల్లి, నాంపల్లిలో 0.3, చండూర్‌లో 0.2 మి.మీ వర్షం కురిసింది. ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 140 మి.మీ. కురవాల్సి ఉండగా 202.2 మి.మీ. వర్షం కురిసింది.
ఇదీ చదవండి:Rains: ఎడతెరిపిలేని వర్షాలతో రెండ్రోజులుగా ముసురుపట్టిన రాష్ట్రం