సుమారు 32 ఏళ్ల క్రితం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన 20 ఎస్సీ కుటుంబాలు ఊరికిరెండు కిలోమీటర్ల దూరంలో కాలనీ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వారికి అతి సమీపంలో సర్వేనంబర్ 77లో ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ ఎలాంటి అనుమతి లేకుండా... 12 ఏళ్లుగా హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ పలుగు రాళ్లను తోడుకుని వెళ్తోంది.
ప్రతి క్షణం భయం:
ప్రారంభంలో కాలనీకి దూరంగా పనులు చేపట్టగా అంతగా సమస్యలు రాలేదు. ఇటీవల కాలనీకి అతి సమీపంలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పాటు చేసి అందులో నుంచి రాళ్లను తీసేందుకు పేలుళ్లు జరుపుతున్నారు. ఎక్కువ శక్తితో జరిగే పేలుళ్లతో... రాళ్లు ఎగిరి ఇళ్లపై పడుతున్నాయి.అంతేకాదు సమీపంలోని పొలాల్లో రాళ్లు పడి పంటను నాశనం చేస్తున్నాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా ఉంటోందని వాపోతున్నారు.
క్వారీ తవ్వకాలతో తమకు ప్రమాదముందని అక్కడపేలుళ్లు జరపకుండా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు రెవెన్యూ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. అసలు ఈ క్వారీకి అనుమతి లేకపోయినా కూడా వారు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ క్వారీ పేలుళ్లపై అధికారులు తక్షణం స్పందించాలని వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చదవండి:'మా పోరు మతాలకు అతీతం'