విజయం కోసం అధికార తెరాస, ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పాటు భాజపా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఎన్నికలు సమీపించడంతో అన్ని పార్టీలు ప్రలోభాలకు తెరలేపాయి. నియోజకవర్గంలో ఏడు మండలాలుండగా.. ఇప్పటికే మూడు మండలాల్లో ఓ ప్రధాన పార్టీ ఓటుకు రూ.1500 చొప్పున ముట్టజెప్పింది. మరో ప్రధాన పార్టీ తనకు కంచుకోటగా ఉన్న గ్రామాల్లో ఓటుకు రూ.2 వేల వరకు పంచింది. ఒక గ్రామంలో వేయి ఓట్లు ఉంటే 700 ఓట్లకు డబ్బులిస్తున్నారు.
మాకెందుకు ఇవ్వట్లేదని..
అందరికీ ఇచ్చి తమకు ఎందుకు ఇవ్వడం లేదంటూ మాడ్గులపల్లి మండలంలోని ఓ గ్రామంలో రెండు కుటుంబాలు అక్కడి నాయకుడిని నిలదీశాయి. దీంతో ఒక్కో కుటుంబానికి రూ.5 వేల చొప్పున ఇచ్చినట్లు తెలిసింది. నగదు పంపిణీ చేయడంతో పాటు మద్యం ఖర్చులకూ డబ్బులు ఇస్తున్నారు. బూత్‌ల వారీగా లెక్కలు తీస్తూ 600 ఓట్లుంటే రూ.15 వేలు, వెయ్యి ఓట్లు ఉంటే రూ.20 వేల చొప్పున.. మద్యం కోసం స్థానిక బాధ్యులకు ఓ పార్టీ గురువారం రాత్రి డబ్బు పంపిణీ చేసింది. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మద్యం నిల్వలు చేరిపోగా, శుక్రవారం రాత్రి డబ్బు పంపిణీ మరింత జోరుగా సాగనుందని సమాచారం.