తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం టోకెన్ల జారీలో గందరగోళం.. తహసీల్దార్ల పర్యవేక్షణతో పారదర్శకత - Nalgonda district farmers issues

ధాన్యం విక్రయాల కోసం రైతులకు అందజేస్తున్న టోకెన్ల విషయంలో గందరగోళం తలెత్తుతున్న దృష్ట్యా... నల్గొండ జిల్లా అధికారులు కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానంలో టోకెన్లకు రసీదుల పంపిణీ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు జరగనుంది. ఈ విధానంలో పారదర్శకత కోసం తహసీల్దార్లకు బాధ్యతలు కట్టబెట్టారు.

Transparency in the issuance of grain tokens
ధాన్యం టోకెన్ల జారీలో పారదర్శకత

By

Published : Nov 17, 2020, 12:30 PM IST

వరి పంట అమ్మకం కోసం జారీ చేస్తున్న టోకెన్ల విషయంలో చోటు చేసుకుంటున్న గందరగోళం.. నల్గొండ జిల్లాలోని అన్ని మండలాల్లో ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తోంది. టోకెన్లు సరిగ్గా పంపిణీ చేయడం లేదన్న అపవాదు తమ పైనే ఉంటోందని భావిస్తున్న యంత్రాంగం.. అందుకు కొత్త పద్ధతిని అనుసరించాలని చూస్తోంది. సోమవారం అందుబాటులోకి వచ్చిన ఈ పద్ధతిలో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు జరగనున్న టోకెన్లకు రసీదుల పంపిణీ జరగనుంది. రసీదుల పంపిణీ బాధ్యతను అధికారులు తహసీల్దార్లకు కట్టబెట్టారు.

తహసీల్దార్లకు బాధ్యత

రైతుల పేర్లు నమోదు చేసుకోవడం నుంచి టోకెన్ల పంపిణీ వరకు బాధ్యతల్ని.. ఇప్పటివరకు మండల వ్యవసాయాధికారులు నిర్వహించారు. ప్రస్తుతం ఆ బాధ్యతను తహసీల్దార్లు తీసుకున్నారు. ఈ విధానంతో పారదర్శకత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. పంపిణీ కేంద్రాల వద్దకు పెద్దఎత్తున జనం చేరుకోవడం, పేర్ల నమోదు, పంపిణీ ప్రక్రియలో రభస చోటుచేసుకుంటుండటం వల్ల... ఏవోలు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉంటున్నారు. జనానికి అనుగుణంగా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునే అధికారం ఏవోలకు లేకపోవడం వల్ల తహసీల్దార్లను నియమించారు.

2 గంటలే టోకెన్ల జారీ

ధరణి రిజిస్ట్రేషన్ల ప్రక్రియతో పూర్తిగా వాటికే అంకితమైన తహసీల్దార్లు.. తమకు లభించే వెసులుబాటు సమయంలోనే టోకెన్ల పంపిణీ చేపట్టేలా ఆదేశాలిచ్చారు. ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్లు, ఇతర కార్యక్రమాల్లో తలమునకలయ్యే తహసీల్దార్లు.. ఉదయాన్నే 2 గంటల ( 8 నుంచి 10) పాటు టోకెన్ల పంపిణీని పర్యవేక్షించాల్సి ఉంటుంది. మండల రెవెన్యూ అధికారులు, ఏవోలు దృష్టిపెట్టడం వల్ల పైరవీలకు తావుండదని భావిస్తున్నారు.

మిర్యాలగూడలో అత్యధిక రద్దీ

మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్​లో 10 మండలాలు ఉండగా అందులో.. తిరుమలగిరి(సాగర్), పెదవూర మినహాయిస్తే మిగిలిన 8 మండలాల్లో కోతలు మొదలయ్యాయి. త్రిపురారం, హాలియా మండలాల్లో రెండు మూడ్రోజుల నుంచి పంట వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని మండలాలను సమన్వయం చేసుకునేలా పంపిణీ ఉండాలని.. తహసీల్దార్లకు ఆర్డీవో రోహిత్ సింగ్ సూచించారు. రెవెన్యూ డివిజన్ కేంద్రమైన మిర్యాలగూడలో రైతుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల.. టోకెన్ల సంఖ్యను పెంచుతున్నారు. వాస్తవంగా నల్గొండ జిల్లాకు కేటాయించిన టోకెన్లు 9 వందలకు గాను ప్రస్తుతం 8 మండలాలకు లెక్కేసినా... 112 వరకు అందించవచ్చు. కానీ మిర్యాలగూడలో రద్దీ అంతకంతకూ పెరుగుతుండటం వల్ల.. జనాన్ని బట్టి గరిష్ఠంగా 250 వరకు ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నారు. కొన్ని మండలాల్లో రైతుల సంఖ్య తక్కువ ఉన్నందున... ఆ టోకెన్లను మిర్యాలగూడకు సర్దుబాటు చేయనున్నారు.

13న రసీదు.. 18న టోకెన్

ఇప్పటికే రసీదులు అందజేసిన వారికి ఇవ్వాల్సిన టోకెన్లు.. మరో రెండు రోజుల్లో ముట్టజెప్పుతారు. ఈ నెల 13 వరకు కేటాయించిన రసీదులు, సీరియల్ నంబర్ల ఆధారంగా.. ఈ నెల 18 వరకు సోమ, మంగళ, బుధవారాల్లో రోజుకు 150 చొప్పున పంపిణీ చేస్తారు. 16 నాడు నమోదు చేసుకున్న రైతులకు మాత్రం... ఈ నెల 19 నుంచి టోకెన్లు అందుకునేలా రసీదులు ఇస్తారు. ఈ నెల 18 వరకు ధాన్యం అమ్ముకునేందుకు... పాతవారికి మినహా కొత్తవారికి అవకాశం లేదన్నమాట.

పారదర్శకతే ప్రాధాన్యం

రసీదులు పొందుతున్న వారిలో 30 శాతం మంది టోకెన్లకు రావడం లేదని అధికారులు గుర్తించారు. అలా మిగిలిపోయిన వాటిని రెండు గంటల పాటు వేచి చూసి.. మిగతా వారికి ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారు. మాడుగులపల్లిలో ఇప్పటికే 5 వందల పేర్లు నమోదు కాగా... అందులో 250 మందికి పంపిణీ చేశారు. మిగతా 250 పేర్లను నోటీసు బోర్డులో అతికించారు. ఇలా నోటీసు బోర్డులో అతికించడం వల్ల పారదర్శకత వస్తుందని గుర్తించి.. ఇదే విధానాన్ని మిగతా మండలాల్లో అమలు చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details