ఉమ్మడి నల్గొండ జిల్లా వరి రైతులను టోకెన్(Farmers protests for Tokens) కష్టాలు వెంటాడుతున్నాయి. వరి కోయాలంటే టోకెన్ ఉండాలనే నిబంధన విధించడంతో అన్నదాతలు తెల్లవారుజాము నుంచే వ్యవసాయ కార్యాలయాలకు వచ్చి పడిగాపులు కాస్తున్నారు. కానీ అధికారులు సకాలంలో కార్యాలయాలకు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఇందుకు నిరసనగా రైతులు త్రిపురారంలో రాస్తారోకోకు దిగారు. టోకెన్ల జారీ(Farmers protests for Tokens)లో నిర్లక్ష్యంపై ఆందోళన చేపట్టారు. టోకెన్లు ఉంటేనే రోడ్డుపైకి ట్రాక్టర్లు రావాలని పోలీసులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. చివరకు పోలీసులు సర్దిచెప్పడంతో రైతులు నిరసన విరమించారు.
మిర్యాలగూడలో టోకెన్ల కోసం బారులు
మిర్యాలగూడలోని రైతు వేదిక వద్ద ధాన్యపు టోకెన్ల(Farmers protests for Tokens) కోసం రైతన్నలు బారులు తీరారు. ఉదయం నాలుగు గంటల నుంచే టోకెన్ల కోసం పడిగాపులు కాస్తున్నా.. అదేమీ పట్టనట్లుగా అధికారులు 11 గంటలకు నెమ్మదిగా టోకన్లు పంపిణీ చేపట్టారు. మూడో తేదీనే.. టోకెన్ల కోసం వచ్చామని అప్పుడు టోకెన్లు లేవని ఈ రోజు రమ్మని చెప్పారని అక్కడున్న రైతులు పేర్కొన్నారు. చీటీ రాసి ఇవ్వడంతో ఉదయం నుంచి వేచి చూస్తున్నామని రైతులు వాపోతున్నారు. టోకెన్ల కోసం ఇన్నిసార్లు తిరగాలంటే ఇబ్బందిగా ఉందని.. ఆవేదన వ్యక్తం చేశారు.
తెల్లవారుజాము నుంచే టోకెన్ల కోసం కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నాం. నిన్న పండుగ సందర్భంగా సెలవు ఉన్నా.. ఈ రోజైనా ఇంతవరకూ ఒక్క అధికారి రాలేదు. ఓ వైపు చేలో పంట కోతకు సిద్ధంగా ఉంది. వర్షం వస్తే ఇన్నాళ్లు పడిన కష్టమంతా వృథా అవుతుంది. రైతులను పట్టించుకునే వారే లేరు. టోకెన్లు కూడా సరిపడా ఇవ్వడం లేదు. అధికారుల నిర్లక్ష్య వైఖరితో విసిగిపోతున్నాం. - రైతులు