నల్గొండ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షానికి ఐకేపీ కేంద్రాల్లోని వరి ధాన్యం తడిసిముద్దయింది. పట్టణంలోని పలు కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీగా వీచిన ఈదురు గాలులకు వృక్షాలు నేలమట్టమయ్యాయి. నాలుగు రోజుల నుంచి ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయడం వల్ల గత రాత్రి కురిసిన వర్షానికి తమ ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.
కొనుగోలు కేంద్రాల వద్ద తమను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు వాపోయారు. ఎలాంటి షరతులు పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలని నార్కట్‌పల్లి-అద్దంకి జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ధర్నాస్థలికి చేరుకున్నారు. కలెక్టర్‌తో ఫోన్ చేయించి.. అన్నదాతలతో మాట్లాడించారు. కలెక్టర్ హామీతో కర్షకులు ఆందోళన విరమించారు.