నల్గొండ జిల్లాలో ఈ ఏప్రిల్ 12న 375 ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించగా.. అదే నెల 17న జరిగిన నాగార్జునసాగర్ ఉపఎన్నిక తర్వాతే సేకరణ వేగం పుంజుకుంది. గత సీజన్లో అత్యధిక మొత్తంలో ధాన్యం కొనుగోలు చేసిన నల్గొండ జిల్లా.. ఈసారి ఆ రికార్డును తానే తిరగరాసి అంతకు మిన్నగా కొనుగోళ్లు జరుపుతోంది. రైతుల నుంచి సరుకు కొనేందుకు జిల్లావ్యాప్తంగా మొత్తం 375 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అందులో సేకరణ పూర్తయిన 2 వందల కేంద్రాలను మూసివేశారు. గత యాసంగిలో కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) సేకరణలోనూ నల్గొండ.. రాష్ట్రంలో అగ్రభాగాన నిలిచింది. 4 లక్షల 41 వేల 148 మెట్రిక్ టన్నులకు గాను.. 100 శాతం రికవరీ చేపట్టిన ఘనత సాధించింది.
ప్రస్తుతం రాష్ట్రంలో అత్యధిక ధాన్యం కొంటున్న జిల్లాలు నల్గొండ, నిజామాబాద్ మాత్రమే. ప్రస్తుతం ఈ రెండు జిల్లాలు కొంచెం అటూఇటుగా.. సమాన స్థాయిలో పంటను కొంటున్నాయి. అయితే నల్గొండ జిల్లాలో 7 లక్షల మెట్రిక్ టన్నులు.. నిజామాబాద్ జిల్లాలో 8 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని ముందస్తుగా అంచనా వేశారు. 90 రోజుల్లో సేకరణ పూర్తి చేయాల్సి ఉన్నా.. 40 రోజుల్లోనే నల్గొండలో 94 శాతం, నిజామాబాద్ లో 82.25 శాతం పూర్తయింది. నిజామాబాద్ జిల్లాలో 7 లక్షల మెట్రిక్ టన్నులు దాటదని అక్కడి అధికారులు భావిస్తుంటే.. నల్గొండ జిల్లాలో 7.5 లక్షల మెట్రిక్ టన్నుల దాకా వస్తుందంటున్నారు. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో.. భారీగా ధాన్యం నిల్వలున్నాయి. మొత్తం 110 మిల్లులకు సరకును కేటాయించగా.. సీఎంఆర్ విషయంలో ఎఫ్సీఐ జాప్యం వల్ల తగినంత ధాన్యం మిల్లుల్లో నిల్వ చేయలేని పరిస్థితి ఏర్పడింది.