తెలంగాణ

telangana

ETV Bharat / state

సైబర్​ నేరగాళ్ల వలలో పడి.. రూ. 11 లక్షల సమర్పణ

ఆన్‌లైన్ మోసాలు పెద్దఎత్తున జరుగుతున్నా... ప్రజల్లో చైతన్యం రావడం లేదు. అపరిచిత సందేశాలకు స్పందించవద్దని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా... వాటిని పెడచెవిన పెడుతూ మాయగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో సైబర్‌ నేరగాళ్ల మాయమాటలు నమ్మిన ఓ వ్యక్తి.... ఏకంగా రూ. 11 లక్షలు సమర్పించుకున్నాడు.

Online fraud in nalgonda chityala
సైబర్​ నేరగాళ్ల వలలో పడి.. రూ. 11 లక్షల సమర్పణ

By

Published : Jul 9, 2020, 4:45 AM IST

సైబర్​ నేరగాళ్ల వలలో పడి.. రూ. 11 లక్షల సమర్పణ

నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన నాగిళ్ల లక్ష్మణ్ రావు అనే వ్యక్తి మోసానికి గురైన కథ వింటే... విస్తుపోవాల్సిందే మరి. ఇంగ్లాండ్‌కు చెందిన ఓ మహిళ... లక్ష్మణ్‌కు ఫేస్‌బుక్‌ ద్వారా సందేశం పంపింది. క్రమంగా పరిచయం పెంచుకొని... తాను హెచ్​ఎస్​బీసీ బ్యాంకులో పనిచేస్తున్నానని, అందులో ఖాతా ఉన్న ఓ పెద్ద వ్యక్తి మృతి చెందినందున ఆ డబ్బును డ్రా చేసేందుకు సహకారం కావాలని కోరింది. సదరు వ్యక్తి ఖాతాలోని నగదు భారత కరెన్సీలో కోట్లాది రూపాయలని నమ్మబలికింది. ఇందుకు మీ ఖాతా వివరాలు పంపాలని కోరింది. లక్ష్మణ్‌ తన ఖాతా వివరాలను పంపగా... ఇంగ్లాండ్‌లో మీ పేరున ఖాతా తీయాల్సి ఉంటుందని అందుకు రూ. 96 వేలు అవసరమని చెప్పగా... ఆ డబ్బుని బదిలీ చేశాడు. అక్కడితో ఆగకుండా... ఏదో ఒక కారణం చెబుతున్న క్రమంలో... రూ. 7 లక్షలకు పైగా సమర్పించుకున్నాడు.

రూ. 11 లక్షలు...

సుమారు రూ. 7లక్షలు సమర్పించుకున్న అనంతరం... దిల్లీకి చెందిన ఓ మహిళ మీకు పంపాల్సిన డబ్బును ఖాతా ద్వారా కాకుండా... పార్సిల్ ద్వారా అందజేస్తామని లక్ష్మణ్‌రావుకు సమాచారం అందించింది. తనకు ఇమిగ్రేషన్ అధికారి పరిచయమని... మీకు పార్సిల్ ద్వారా పంపడం చాలా సులువని మళ్లీ లక్ష్మణ్‌రావును బుట్టలో వేశారు. అలా మరో మూడు లక్షలకు పైగా ముట్టజెప్పాడు. తన వద్దనున్న డబ్బుతో పాటు పలువురి వద్ద అప్పు చేసి మరీ... నగదు బదిలీ చేశాడు. జనవరి నుంచి ఏప్రిల్ చివరి వరకు ఈ తతంగం కొనసాగగా... రూ. 11 లక్షలు పోగొట్టుకున్నాడు. తర్వాత ఫోన్లు పనిచేయడం మానేయగా బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

అత్యాశ..

అత్యాశకు పోయి.. అసలు విషయం బోధపడి ఏం చేయాలో తెలియక ప్రస్తుతం నాగిళ్ల లక్ష్మణ్‌ రావు తలపట్టుకున్నాడు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇలాంటి మాయగాళ్ల వలలో పడొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

ఇవీ చూడండి:తెలంగాణలో కొత్తగా 1924 మందికి కరోనా పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details