మేజర్ గ్రామ పంచాయతీ గడువు పూర్తి చేసుకుని... నల్గొండ జిల్లా నకిరేకల్ నూతన పురపాలక సంఘంగా ఏర్పడింది. తొలి ప్రత్యేకాధికారిగా నల్గొండ ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి... కమిషనర్గా స్థానిక ఎంపీడీవో వెంకటేశ్వర్ రావు బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల క్రితం ఏర్పాటైన 68 కొత్త పురపాలికల్లో భాగంగా... నకిరేకల్ను కూడా మున్సిపాలిటీగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మిగతావన్నీ 2018 ఆగస్టు 2న పురుడు పోసుకోగా... గ్రామ పంచాయతీ పాలకవర్గం గడువు ముగియనందున నకిరేకల్ పురపాలిక అవతరణ వాయిదా పడింది. పంచాయతీ గడువు ముగిసిన వెంటనే పురపాలన అమల్లోకి వచ్చేలా... గతంలోనే ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. నకిరేకల్ గ్రామ పంచాయతీకి 2015 డిసెంబరు 5న ఎన్నికలు జరగ్గా... ఈ నెల 15తో గడువు తీరిపోయింది.
రెండేళ్ల తర్వాత మళ్లీ పురపాలికగా...
నకిరేకల్తో పాటు చుట్టూ ఉన్న ఆరు గ్రామ పంచాయతీలను విలీనం చేసి 2011 ఆగస్టు 24న అప్పటి ప్రభుత్వం... పురపాలక సంఘంగా ఏర్పాటు చేసింది. తదనంతరం రెండేళ్లపాటు పురపాలికగా కొనసాగింది. అయితే అర్హత లేకున్నా 10 కిలోమీటర్ల దూరంలోని పల్లెల్ని విలీనం చేసి మరీ మున్సిపాలిటీని ఏర్పాటు చేశారంటూ... విలీన గ్రామాలకు చెందిన ప్రజలు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 2013 సెప్టెంబరులో పురపాలికను రద్దు చేసిన న్యాయస్థానం... తిరిగి గ్రామ పంచాయతీగా పునరుద్ధరించింది.
ఈ ఉత్తర్వులు 2014 ఫిబ్రవరిలో అమల్లోకి రావడంతో... 2015 డిసెంబరు 5న నకిరేకల్ మేజర్ పంచాయతీకి ఎన్నికలు జరిగాయి. ఇప్పుడా గడువు తీరిపోవడంతో... పురపాలిక అవతరణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయినట్లయింది.
ఇదీ చూడండి:దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి రంగం సిద్ధం!