నెల్లికల్ లిఫ్టు(Nellikal lift irrigation) తరహాలోనే గుర్రంపోడు(gurrampodu lift irrigation) లిఫ్టును పూర్తిచేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్(cm kcr) ప్రకటించడంతో... నల్గొండ జిల్లాలో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఆగస్టు 2న హాలియాలో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్... గుర్రంపోడు లిఫ్టు ప్రారంభిస్తామంటూనే సర్వే చేపట్టాలంటూ ఆదేశించారు. గుర్రంపోడు ఎత్తిపోతల పథకం ద్వారా ప్రస్తుతానికి 10 గ్రామాల్లోని భూములకు మాత్రమే నీరు అందించే విధంగా ప్రతిపాదనలు తయారయ్యాయి. సాధ్యాసాధ్యాలను బట్టి మరికొన్ని గ్రామాలకు విస్తరించే ఆలోచనలో అధికారులు ఉన్నారు. 10 గ్రామాల్లో మొత్తం 28 చెరువులు, కుంటల కింద వెయ్యీ 70 ఎకరాల ఆయకట్టును ఇప్పటికే గుర్తించారు. అయితే పూర్తిస్థాయిలో ఎంత ఆయకట్టుకు నీరివ్వాలనేది తేల్చాల్సి ఉంటుంది. ఇందుకు అధికార యంత్రాంగం నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో మంతనాలు సాగిస్తోంది. శాసనసభ్యుడు భగత్‌తో ఇప్పటికే భేటీ అయింది.
కసరత్తు షురూ
ఇప్పటివరకు పోచంపల్లి, వట్టికోడు, వెంకటాపురం, ఊట్లపల్లి, కొండాపురం, తేనెపల్లి, గుర్రంపోడు, సుల్తాన్ పురం, ఎల్లమోనిగూడెం, తానేదార్ పల్లి గ్రామాలను గుర్తించారు. కరవు పరిస్థితులు నెలకొన్న జూనూతల, మక్కపల్లి, శాఖాజిపురం వాసులు సైతం తమకు నీరు కావాలని కోరుతున్నారు. నాంపల్లి, చండూరు మండలాల పరిధిలోని కొన్ని గ్రామాలు సైతం లిఫ్టు నీరు అందే ప్రాంతాలకు సమీపంగా ఉన్నందున... అక్కడి ప్రజలు కూడా ఆశలు పెట్టుకున్నారు. గుర్రంపోడు ఎత్తిపోతల పథకం సర్వేను... గిరి ప్రైవేటు కన్సల్టెన్సీ సంస్థకు అప్పగిస్తున్నారు. గతంలో అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(AKBR), పెద్దగట్టు పథకాలకు సర్వే నిర్వహించిన అనుభవం ఉండటంతో... గిరి కన్సల్టెన్సీకి సర్వే బాధ్యతలు కట్టబెడుతున్నారు. అయితే ఈ లిఫ్టు కింద ఆయకట్టు ఎంతనేది తేలిన తర్వాతే సర్వే ప్రారంభం కానుంది. దీనిపై ఇప్పటివరకు నీటిపారుదల శాఖ నుంచి స్పష్టత రాలేదు.
'ప్రతిపాదనలు సిద్ధమైన తర్వాతే రంగంలోకి దిగుతాం. కేవలం చెరువులే నింపాలా లేక... వాటితోపాటు ఎగువ ప్రాంతాలకు నీటిని తరలించాలా అన్నదానిపై అధికారుల ప్రతిపాదనల ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం. ఇందుకోసం బ్లాక్ లెవెలింగ్ సర్వే, కాంటూర్ సర్వేలు చేపట్టాల్సి ఉంటుంది. నీరందించే భూముల ఎత్తు, పల్లాలు ఎలా ఉంటాయన్న కోణంలో కాంటూర్ సర్వే నిర్వహిస్తారు. అయితే గుర్రంపోడు లిఫ్టు ద్వారా చెరువులు నింపి నీటిని అందించడమా.. లేదంటే ఆ చెరువుల ద్వారా నీటిని ఎగువ ప్రాంతాలకు ఎత్తిపోయడమా అన్నది అధికారులు అందజేసే ప్రతిపాదనలను బట్టి సర్వే చేపట్టాల్సి ఉంటుంది.'