తెలంగాణ

telangana

ETV Bharat / state

Nlg Municipalities: పేరుకే పురపాలికలు... పంచాయతీల కంటే దారుణం

పేరు మారినా తీరు తెన్నులు మాత్రం మారలేదు. చెప్పుకునేందుకు పురపాలికలైనా... పరిస్థితులు మాత్రం పంచాయతీల కంటే దారుణం. నిధులు లేక కొన్ని... ఉన్నా వాడుకోలేని స్థితిలో మరికొన్ని. ఇలా... ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రగతిపథంలో నడవాల్సిన పురపాలికలు... అభివృద్ధికి ఆమడదూరంలో నిలుస్తున్నాయి. పారిశుద్ధ్యానికి ప్రేరణగా నిలవాల్సి ఉన్నా... పట్టింపులేని ధోరణే కనిపిస్తోంది.

municipalities
పురపాలికలు

By

Published : Aug 1, 2021, 5:51 AM IST

పేరుకే పురపాలికలు... పంచాయతీల కంటే దారుణం

ఉమ్మడి నల్గొండ పరిధిలోని సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో గతంలో 5 పురపాలక సంఘాలు (Municipalities) ఉండగా... ప్రస్తుతం వాటి సంఖ్య 19కి చేరుకుంది. పేరుకు పురపాలికలుగా మారినా... అభివృద్ధి ముందుకు సాగక... చాలా చోట్ల ఇంకా పంచాయతీలనే తలపిస్తున్నాయి. నల్గొండ జిల్లాలో 8 పురపాలికలుండగా... అందులో 5 కొత్తగా ఏర్పడ్డవే. జాతీయ రహదారిపైన గల చిట్యాలకు నిధులు నిలిచిపోయాయి. కేవలం పట్టణ ప్రగతి పేరిట వస్తున్న డబ్బులతోనే కార్యక్రమాలన్నీ నిర్వహించాల్సి వస్తోంది. పురపాలికకు వస్తున్న ఆదాయం... సిబ్బంది జీతాలు, పారిశుద్ధ్య నిర్వహణకే సరిపోతోంది. చండూరు, నందికొండ, హాలియా, నకిరేకల్ వంటి పంచాయతీలు పురపాలికలుగా ఏర్పాటైనా... అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదు. అక్రమ కట్టడాలు విపరీతంగా వెలుస్తున్నా... పాలకవర్గాలు కన్నెత్తి చూడటం లేదు. పలుచోట్ల నేటికీ తాగునీటి సమస్య ప్రజలను తీవ్రంగా వేధిస్తోంది.

శంకుస్థాపనలకే పరిమితం...

సూర్యాపేట జిల్లాలో 5 పురపాలికలు ఉండగా... జిల్లా కేంద్రంతో పాటు హుజూర్‌నగర్, కోదాడ, నేరేడుచర్ల, తిరుమలగిరిలో అభివృద్ధి పనులే లేకుండా పోయాయి. తిరుమలగిరిలో ప్రధానంగా పారిశుద్ధ్య సమస్య నెలకొని ఉంది. శివారు కాలనీల్లోని చెత్తను వారానికి రెండు సార్లు తరలిస్తున్నారు. మురికి కాల్వల నిర్మాణాలు, సీసీ రహదారులు ఒక్కటీ పూర్తి కాలేదు. కోటీ 4 లక్షలతో తిరుమలగిరి పట్టణంలోని రహదారులకు శంకుస్థాపన చేసి నెల దాటినా... పనులే మొదలు కాలేదు.

అలసత్వం...

నిధులున్నా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందడుగు పడకపోవటం... అలసత్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలోని సీసీ రహదారులకు ఇరువైపులా మురికి కాల్వలు లేకపోవడంతో... వర్షాల వేళ వరద ఇళ్లల్లోకి చేరుతోంది. హుజూర్‌నగర్ ఉపఎన్నిక సందర్భంగా నేరేడుచర్లకు సీఎం 15 కోట్లు మంజూరు చేయగా... టెండర్లు పిలిచారు. కానీ విపక్ష కౌన్సిలర్లు కోర్టుకెక్కడంతో అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయాయి. ఇక డంపింగ్ యార్డులు లేక... చెత్తనంతా పాడుబడ్డ బావుల్లోనే పారబోస్తున్నారు.

నత్తనడకన...

యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 పురపాలికలు ఉన్నాయి. యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూరు వంటి చిన్న పట్టణాలు సైతం పురపాలక సంఘాలుగా ఏర్పడ్డాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి పట్టణ అభివృద్ధికి రూ. 20 కోట్లు మంజూరైనా... పనులు నత్తనడకన సాగుతున్నాయి. మురుగునీటి కాల్వలు, సీసీ రహదారులు, సమీకృత మార్కెట్ కోసం నిర్మాణాలు చేస్తున్నారు. సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటంతో పారిశుద్ధ్య కార్యక్రమాలకు ఇబ్బందులున్నాయి. ఆలేరుకు కూడా రూ. 20 కోట్లు మంజూరు కాగా... సీసీ రహదారులు, సెంట్రల్ లైటింగ్ పూర్తయ్యాయి. డ్రైనేజీ నిర్మాణాలు రహదారులకు ఇరువైపులా జరుగుతున్నాయి.

అందని నిధులు...

మోత్కూరులో 16 వేల మంది జనాభాకు గానూ.... నెలకు రూ. 20 లక్షల దాకా నిధులు వస్తుండగా... మొత్తం ఖర్చవుతున్నాయి. మంచినీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల విషయంలో పెద్దగా ఇబ్బందిలేదు. రూ. 85 లక్షలతో టెండర్లు పూర్తయి, సీసీ రోడ్లకు రూ. 70 లక్షలు, రూ. 15 లక్షలు మురుగు కాల్వలకు కేటాయించినా... పనులు చేపట్టాల్సి ఉంది. మరో రూ. 7 కోట్ల 20 లక్షలు మంత్రి కేటీఆర్ మంజూరు చేయగా... ఇంకా నిధులు అందలేదు. రహదారి విస్తరణతోపాటు చాలా చోట్ల సీసీ రోడ్లు వేయాల్సి ఉందని ప్రజలు చెబుతున్నారు.

అనర్థాలే ఎక్కువ...

పరిసరాల పరిశుభ్రత పేరిట వ్యర్థాల నిర్వహణ సక్రమంగానే సాగుతున్నా... వాటిని అడ్డగోలుగా వదిలేయడంతో కలిగే అనర్థాలే ఎక్కువగా ఉంటున్నాయి. నిధులు, సిబ్బంది కొరత, నిర్వహణ వైఫల్యంతో పురపాలికల్లోని డంపింగ్ యార్డులు... కాలుష్యకారకంగా, దుర్గంధభరితంగా మారిపోయాయి. వేలాది మెట్రిక్ టన్నుల్లో పేరుకుపోయిన చెత్తను పునరుత్పత్తి చేయడానికి బదులు... అడ్డగోలుగా తగలబెట్టడమో లేదా చెరువులు, వాగుల్లో పారబోయడమో చేస్తున్నారు. వాటి పరిసరాల్లోని ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. కొత్తగా పురపాలికలుగా ఏర్పాటైన పట్టణాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఇటు పంచాయతీలుగా లేక.... అటు పూర్తిగా పురపాలికలుగా మారక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.

ఇదీ చదవండి: Lal Darwaza Bonalu: రేపే లాల్‌దర్వాజా బోనాలు.. ఉత్సవాలకు ముస్తాబైన భాగ్యనగరం

ABOUT THE AUTHOR

...view details