నల్గొండ జిల్లా పరిధిలోని ఏడు మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన పూర్తిచేశారు. ఎన్నికల సంఘం అదేశాల మేరకు పురపాలికల వారీగా తాజాగా మంగళవారం తుది ఓటర్ల జాబితా విడుదల చేశారు. ఈనెల 17న పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల చేసి, ఫిర్యాదులు, పరిశీలన తర్వాత తుది జాబితాను 21వ తేదీన ప్రకటించనున్నారు. మరో పక్క ఎన్నికల నిర్వహణలో పాలుపంచుకునే అధికారులను నియామకం చేస్తూ విధులు, బాధ్యతలు అప్పగించారు. వారికి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రాదేశిక పోరు మాదిరిగానే బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహించనుండటంతో అందుకు కావాల్సిన సామగ్రి కొనుగోలుకు అంచనాలు రూపొందించి ఉన్నతాధికారుల అనుమతులు కోసం ఎదురు చూస్తున్నారు.
పార్టీల గుర్తులతోనే సమరం
ఇటీవల జరిగిన జిల్లా పరిషత్తు, శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో అవలంబించిన మాదిరిగానే ఆయా పార్టీల గుర్తుల ద్వారా మున్సిపల్ సమరం జరిపేందుకు ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకొంది. 2014 ఎన్నికల సమయంలో ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించిన విషయం తెలసిందే. ఈ సారి మాత్రం బ్యాలెట్ పత్రాలతో నిర్వహించేందుకు సన్నద్ధమైంది. ఇటీవల ప్రాదేశిక పోరుకు ఉపయోగించిన బ్యాలెట్ పెట్టెలను మున్సిపల్ ఎన్నికలకు ఉపయోగించుకునేందుకు ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించినట్లు సమాచారం. జిల్లా కేంద్రంలోనే అన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలను ముద్రించేందుకు కసరత్తు చేస్తున్నారు. అవసరమైతే హైదరాబాద్‌లోను ముద్రించేలా ముద్రణ కేంద్రాల ఆన్వేషణ కొనసాగిస్తున్నారు.