తెలంగాణ

telangana

ETV Bharat / state

గర్భిణులు, బాలింతలకు అందని పోషకాహారం - nalgond icds

సాధారణంగా శిశువు ప్రసవించగానే బరువు తూస్తారు. కనీసం రెండున్నర కిలోల బరువుండాలి. ఏడాదిలోగా పది కిలోల బరువు పెరగాలి. అంతకన్నా తక్కువ బరువుంటే పోషకాహార లోపం ఉన్నట్టు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 9.7 శాతం మంది పిల్లలు తక్కువ బరువుతో జన్మిస్తున్నారు. దీనికి కారణం గర్భంతో ఉన్నప్పుడు తల్లి తగినంత పోషకాహారం తీసుకోకపోవడమే!

గర్భిణులు, బాలింతలకు అందని పోషకాహారం

By

Published : Jul 17, 2019, 9:20 AM IST

రెండేళ్ల వయసుకే 80 శాతం మెదడు ఎదుగుదల తల్లి గర్భంలో, జన్మించిన 24 నెలల్లోనే శిశువు మెదడులో 80 శాతం అభివృద్ధి చెందుతుంది. ఈ దశలో తగినంత పోషకాహారం అవసరం. ఆ సమయంలో సమతుల పోషకాహారాన్ని అందించడంలో తేడా వస్తే మెదడు ఎదుగుదలలో లోపం ఏర్పడుతుంది. జిల్లాలో పోషకాహార లోపం ఎంత ఉందో జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే గణాంకాలు తెలియజేస్తున్నాయి.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 34,83,648 జనాభా ఉంది. 8,75,432 కుటుంబాలున్నాయి. ఇందులో నలభై శాతం కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి. వారికి సరైన పోషకాహారం అందడం లేదు. గర్భిణులు, బాలింతలకు తగినంత పోషకాహారం అందకపోవడంతో గర్భస్థ శిశువులపై ప్రభావం పడుతుంది. పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లా జనాభాలో మూడో వంతు మందిలో అంటే సుమారు పది లక్షల మంది వయసుకు తగినంత ఎత్తు, ఎత్తుకు తగినంత బరువు, తగినంత మస్తిష్కం ఎదుగుదల లేదని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో గుర్తించారు. దీనికి కారణం ఏమిటంటే పోషకాహార లోపం! గర్భిణులు, బాలింతలకు, శిశువులకు తగినంత పోషకాహారం అందకపోవడమే. ఆయా కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు రోజుకు ‘గ్లాసు చిక్కటి పాలు’ అందించాల్సి ఉంది. రెండు నెలలుగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు పాల సరఫరా నిలిచిపోయింది. పోషకాహారంలో ప్రధానమైన సంపూర్ణాహారాన్ని పొందలేకపోతున్నారు. ఆ మేరకు గర్భిణికి, వారి గర్భంలోని శిశువుకు శారీరక, మానసిక ఎదుగుదలలో నష్టం జరుగుతుంది.

పాల సరఫరాలో ప్రతి నెలా అంతరాయమే!

ప్రతి రోజూ అంగన్‌వాడీ కేంద్రంలో నమోదైన గర్భిణులకు, బాలింతలకు ‘ఆరోగ్య లక్ష్మి’ పథకంలో ఒక పూట సంపూర్ణాహారం వండి వడ్డించాల్సి ఉంది. దీంతో పాటు మంగళ, గురు, శుక్ర, శనివారాల్లో వాళ్లు తాగడానికి గ్లాసు చిక్కటి పాలు (200మి.లీ.) వేడి చేసి అందించాల్సి ఉంటుంది. సోమ, బుధవారాల్లో ఆ పాలను పెరుగుగా మార్చి ఇవ్వాల్సి ఉంది. హైదరాబాద్‌లోని ‘హాకా’ ద్వారా పాల టెట్రా ప్యాక్‌లను అంగన్‌వాడీ కేంద్రాలకు చేరవేసి నిల్వ చేస్తుంటారు. వారం ముందుగానే సరిపడినన్ని పొట్లాలు ఆయా కేంద్రాల్లో ఉంచితే అంతరాయం లేకుండా గర్భిణులు, బాలింతలకు పాలు అందుతాయి. చౌటుప్పల్‌లోని ఒక అంగన్‌వాడీ కేంద్రంలో 2017 నుంచి 2019 జులై వరకు పాల సరఫరాను ‘న్యూస్‌టుడే’ సోమవారం పరిశీలించింది. ప్రతి నెలలోనూ పాల సరఫరాలో అంతరాయం ఏర్పడింది. నిల్వలు లేకపోవడంతో పాలను అందించలేకపోయారు.

ఆరోగ్యలక్ష్మికి చెల్లింపుల్లేవు

పోషకాహార లోపాన్ని సరిదిద్దడానికి అంగన్‌వాడీ కేంద్రాల్లో మూడు నుంచి ఆరేళ్ల మధ్య వయసు పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు ఒక పూట సంపూర్ణ ఆహారాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 2011 లెక్కల ప్రకారం ఆరేళ్లలోపు పిల్లలు 3,71,735 మంది ఉన్నారు. వారిలో జాతీయ ఆరోగ్య సూచిక-4 ప్రకారం సుమారు 75వేల మంది (23.1శాతం) వారి ఎత్తుకు తగ్గ బరువు లేరని గుర్తించారు. రెండు లక్షల మందికి పైగా (69.1 శాతం) రక్తహీనతతో ఉన్నారు. పేద కుటుంబాలవారు ఇంట్లో తగినంత పోషకాహారం అందించలేని పరిస్థితి ఉన్నదని ప్రభుత్వం గుర్తించి ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా ఒక పూట సంపూర్ణాహారం అందించాలని నిర్ణయించింది. ఈ భోజనంతో గర్భిణులకు, బాలింతలకు 1192 కిలోక్యాలరీల శక్తి, 37.04 గ్రాముల ప్రొటీన్లు, 578 గ్రాముల క్యాల్షియం అందుతుందని లెక్కగట్టారు. పిల్లలకు అందించే భోజనంతో 563 కి.కా. శక్తి, 19.7 గ్రాముల ప్రొటీన్లు, 61.5 గ్రాముల క్యాల్షియం అందుతాయి. భోజనం సిద్ధం చేయడానికి బియ్యం, పప్పు, నూనె ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఉప్పు, పసుపు, కారం, కూరగాయలు, ఆకుకూరలు అంగన్‌వాడీ టీచర్‌ కొనుగోలు చేసి ఆయాతో వండించి గర్భిణులకు, బాలింతలకు వడ్డించే బాధ్యత అప్పగించారు. వీటిని కొనుగోలు చేయడానికి ఒక్కరికి రూ.2.10 (రెండు రూపాయల పది పైసలు) చెల్లించాలని నిర్ణయించారు. పెరిగిన ధరలతో ఈ డబ్బు సరిపోవడం లేదు. ఈ బిల్లులు కూడా పది నెలలుగా పెండింగులో ఉన్నాయి. దీంతో ఎత్తు, బరువు పెరుగుదల, రక్తం ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది.

ఇదీ చూడండి: 32 ఏళ్లుగా.. వేల పాటలు రాసి అలరిస్తోన్న క్లెమెంటో

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details