నల్గొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణంలో నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా తెరాస పార్టీ సన్నాహక సమావేశం జరిగింది. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అనే నినాదంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకు లక్షా 38 వేల ఉద్యోగాలు కల్పించామని, మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం నిరుద్యోగ భృతి తప్పకుండా ఇస్తామని చెప్పారు. దానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు కల్పించడం, పెరిగే జీతభత్యాలు, ఉద్యోగ భద్రత లాంటి విషయాల్లో కేసీఆర్ దృఢనిశ్చయంతో ఉన్నారని స్పష్టం చేశారు.
చాలా సమస్యలు పరిష్కరించా
గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికైనపుడు కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలను లేవనెత్తి అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా కృషి చేశానని పల్లా పేర్కొన్నారు. అంగన్వాడీలు, హోంగార్డులు, ఆశావర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల జీతభత్యాలు పెంపు విషయంలో తన గళం విప్పినట్లు వెల్లడించారు. ప్రశ్నించే గొంతుకను గెలిపించమని కొంతమంది కోరుతున్నారని.. కానీ ప్రశ్నించే గొంతు ప్రశ్నించడానికే మిగిలిపోతుందని ఎద్దేవా చేశారు. పరిష్కరించే గొంతుకనై మీ తరఫున నిలబడతానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, సమస్యల పరిష్కారానికి తాను చేసిన పనులను చూసి మరోసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా పరిషత్ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కరరావు, మున్సిపల్ ఛైర్మన్ తిరునగరు భార్గవ్, తెరాస నాయకులు, పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:60శాతం ఫిట్‌మెంట్ కోరుతూ సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే లేఖ