నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలోని బంగారుగడ్డ గ్రామానికి చెందిన మైనం భవ్య ఏపీ ఎంసెట్ అగ్రికల్చర్ విభాగంలో రాష్ట్రస్థాయిలో 11వ ర్యాంకు సాధించి సత్తా చాటింది. భవ్య తండ్రి మైనం కృష్ణయ్య మిర్యాలగూడలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు. భవ్య చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేది. పదో తరగతిలో 9.8 పాయింట్లు సాధించింది. ఆ తర్వాత రెండు రాష్ట్రాలకు కలిపి నిర్వహించిన ఏఎస్ రావు టాలెంట్ టెస్టులో 5వ ర్యాంకు సాధించింది. ఎన్టీఎస్ఈ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో 10వ ర్యాంకు సాధించి సత్తా చాటింది. ఇంటర్మీడియట్ పరీక్షల్లో సైతం 990 మార్కులతో తన ప్రతిభను నిరూపించుకుంది.
నల్గొండ విద్యార్థినికి.. ఏపీ ఎంసెట్లో 11వ ర్యాంక్ - ఎంసెట్ ఫలితాలు
ఏపీ ఎంసెట్ అగ్రికల్చర్ విభాగంలో నల్గొండ జిల్లాకు చెందిన విద్యార్థిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో 11వ ర్యాంకు సాధించి సత్తా చాటింది. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండే భవ్య.. ఇటీవల విడుదలైన ఎన్టీఎస్ఈ పరీక్షల్లో సైతం 10వ ర్యాంకు సాధించింది. తమ కూతురు మంచి ర్యాంకు సాధించడం పట్ల సంతోషంగా ఉందని తల్లిదండ్రులు తెలిపారు.
కాగా తాజాగా వెలువడిన ఏపీ ఎంసెట్ ఫలితాల్లో అగ్రికల్చర్ విభాగంలో రాష్ట్రస్థాయిలో 11వ ర్యాంకు సాధించి తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలం చూపించింది. తమ కూతురుకు మంచి ర్యాంకు రావడం సంతోషంగా ఉందని.. కష్టపడి సాధిస్తే ఫలితం తప్పకుండా వస్తుందనడానికి ఇదొక ఉదాహరణ అని భవ్య తండ్రి కృష్ణయ్య అన్నారు. కాలేజీలో లెక్చరర్ల సలహాలు, వారు చెప్పిన పాఠ్యాంశాలు క్రమం తప్పకుండా పాటించి.. రోజుకు పది గంటలు చదవడం వల్ల ఈ ర్యాంకు వచ్చిందని.. భవ్య తెలిపింది. నీట్, ఎంబీబీఎస్ పరీక్షలు కూడా రాసిన భవ్య ఫలితాల కోసం ఎదురు చూస్తుంది. వాటిలో కూడా మంచి ఫలితాలొస్తాయని భరోసా వ్యక్తం చేసింది.