ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జల వివాదం క్రమంగా ముదురుతోన్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టులోని ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్దకు భారీగా బలగాలను పంపింది. ప్రాజెక్టు వద్దకు వెళ్లిన నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ అక్కడి పరిస్థితులను సమీక్షించారు.
ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. ఇప్పటికే విధుల్లో ఉన్న ఎస్పీఎఫ్ సిబ్బందితో పాటుగా మరో 100 మందిని అదనంగా మోహరించామని పేర్కొన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్ర సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశామని స్పష్టం చేశారు.
ఎందుకు ఈ వివాదం
రాష్ట్ర రైతుల అవసరాల దృష్ట్యా సంపూర్ణ సామర్థ్యం మేరకు జలవిద్యుత్ ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జెన్కోను ఆదేశించింది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఇంధనశాఖ ఉత్తర్వులు వెలువరించింది. దాదాపు 2500 మెగావాట్ల విద్యుత్‌ను నీటి ద్వారా ఉత్పత్తి చేయాలని స్పష్టం చేసింది. కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేసింది. కృష్ణా జలాల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై కృష్ణా రివర్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందని భావించిన అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు శ్రీశైలం, నాగార్జున సాగర్ విద్యుత్ కేంద్రాల్లో 100 శాతం విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని రాష్ట్ర సర్కారు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదంవండి:AP-TS Water Dispute: నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద భద్రత కట్టుదిట్టం