న్యాయవాద వృత్తి ముసుగులో వందల ఎకరాలు భూ కబ్జా చేయడం సహా, బాధితులను బెదిరించడం, నకిలీ పత్రాలు సృష్టించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిపై నల్గొండ జిల్లా పోలీసులు పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. నిందితులు బంటు బుచ్చిబాబు, అతని కుమారుడు మహేశ్, బావమరిది పాపయ్యలను అరెస్ట్ చేశారు.
మిర్యాలగూడ పట్టణం రామచంద్ర గూడేనికి చెందిన బంటు బుచ్చిబాబు.. పట్టణం సమీపంలోని ఖాళీగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు భూముల ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పలు భూములకు సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి బాధితుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. వివాదాస్పద భూముల విషయంలో జోక్యం చేసుకుని .. ఇరువర్గాల నుంచి అందినకాడికి దోచుకుంటున్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు పేర్కొన్నారు. ఒక్క దామరచర్ల మండలంలోనే 220 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు అధికారులు తెలిపారు.
పట్టణంలోని వృత్తి విద్యా కళాశాలకు సంబంధించిన భూమికి నకిలీ పత్రాలు సృష్టించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బాధితునితో రూ.16 లక్షలకు ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కేవలం రూ.లక్షకే రసీదు ఇచ్చాడని.. బాధితులు తెలిపారు.
వసూళ్లు..
మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డలో 956 సర్వే నంబర్లో నేరెళ్ల పాపయ్య.. ఐదు ఎకరాల భూమిలో ప్లాట్లు చేసి విక్రయించాడు. అనంతరం ఆ భూమికి నకిలీ పత్రాలు సృష్టించి.. సుమారు 50 మంది నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడ్డారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.