ఆరిపోతున్న ఆ ఇంటికి 'ఈటీవీ భారత్' వెలుగునిచ్చింది! నల్గొండ జిల్లా తిప్పర్తికి చెందిన కొత్త రమేశ్... తాటి చెట్లు గీస్తూ జీవనం సాగించేవాడు. 2011 జూన్ 6న ప్రమాదవశాత్తూ... తాటి చెట్టుపై నుంచి కిందపడ్డాడు. వెన్నెముక పూర్తిగా దెబ్బతిని... నడుము కింది భాగంలో ఆచ్ఛాదన లేకుండా పోయింది.
ఈటీవీ భారత్‌తో వెలుగులోకి
గత నవంబర్ 21న ఈటీవీ భారత్‌లో 'కాళ్లు, వెన్నెముక లేకున్నా... బండి నడుపుతూ...' శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి నల్గొండ ఇంఛార్జి కలెక్టర్ చంద్రశేఖర్ స్పందించారు. రమేశ్‌ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు.
గత 8ఏళ్లుగా భార్యే... అన్ని తానై...
ఎనిమిదేళ్ల నుంచి రమేశ్‌కు ఆయన భార్య లక్ష్మీయే... సపర్యలు చేస్తోంది. ముగ్గురు కూతుళ్లు కాగా... పిల్లల చదువుకు ఏటా 30 వేలు వెచ్చిస్తున్నాడు. అతని మందులకు నెలకు నాలుగైదు వేలు అవుతోంది. ఇలా దయనీయ స్థితిలో కాలం గడుపుతున్న రమేశ్ కుటుంబం దీనగాథను... ఈనాడు - ఈటీవీ భారత్ వెలుగులోకి తెచ్చాయి.
ఆదుకుంటామన్న ఇంఛార్జి కలెక్టర్
స్పందించిన ఇంఛార్జి కలెక్టర్ వి.చంద్రశేఖర్... బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించి తామున్నామంటూ ధైర్యం చెప్పారు. అప్పటికప్పుడు రెండు పడక గదుల ఇల్లు మంజూరు చేయడంతోపాటు... ముగ్గురు పిల్లల చదువుకు ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు.
పిల్లలకు విద్యాబోధన
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ముగ్గురమ్మాయిలకు విద్యాబోధన అందుతుందని హామీ ఇచ్చారు. ఇప్పుడున్న మోటార్ సైకిల్ బాగా లేనందున, రమేశ్ కోరిక మేరకు కొత్త త్రిచక్ర వాహనాన్ని అందిస్తామని కలెక్టర్ తెలియజేశారు. మందులకు ప్రతి నెలా అవుతున్న వ్యయాన్ని సైతం... దాతల ద్వారా బాధితుడి కుటుంబానికి అందేలా చూస్తామన్నారు ఇంఛార్జి కలెక్టర్ చంద్రశేఖర్.
పంటల కోసం రమేశ్... గతంలో 18 బోర్లు వేయిస్తే అందులో 17 విఫలమయ్యాయి. కేవలం ఒక్క బోరుతోనే ప్రస్తుతం పొలానికి నీరందిస్తున్నాడు.
సంబంధిత కథనం: కాళ్లు, వెన్నెముక లేకున్నా... బండి నడుపుతూ...