DMHO Dance: నల్గొండ పట్టణంలోని టీఎన్జీవో భవన్లో ఈరోజు(ఫిబ్రవరి 20) ఆశావర్కర్లకు మంత్రి జగదీశ్‌రెడ్డి స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. అయితే.. ఈ కార్యక్రమం సందర్భంగా ఆశావర్కర్లతో పాటు డీఎంహెచ్‌వో కొండల్రావు ఉదయం నుంచి వేచిఉన్నారు. మంత్రి రాకా కాస్త ఆలస్యం కావటంతో.. కార్యక్రమం కొంచెం లేట్‌గా జరిగింది. మంత్రి రావటం.. ఆశావర్కర్లందరికి స్మార్ట్ ఫోన్లు పంచటం అంతా ముందనుకున్నట్టే జరిగింది. కానీ.. ఆ తర్వాత జరిగిన కార్యక్రమం మాత్రం కొంత ఆసక్తికరం..
అలసత్వం పోయి కొత్త ఉత్సాహం వచ్చేలా..
ఈ కార్యక్రమంలో కోసం జిల్లాలో ఉన్న ఆశావర్కర్లంతా హాజరయ్యారు. డీఎంహెచ్‌వో ఎలాగూ వచ్చారు. అయితే.. కార్యక్రమం ఆలస్యం కావటంతో.. ఆశావర్కర్లలో కొంత అసహనం ఏర్పడింది. వాడిపోయిన వారి ముఖాల్లో కొంత తేజస్సు నింపాలనుకున్నాడో.. వారిలో కొత్త ఉత్తేజాన్ని తట్టిలేపాలనుకున్నారో.. డీఎంహెచ్‌వో మైకు అందుకున్నారు. మాంచి ఊపోచ్చే తెలంగాణ జానపద పాటలు పెట్టమని సౌండ్ సిస్టమ్ అబ్బాయికి చెప్పారు. వెంటనే ఆ అబ్బాయి.. వింటేనే స్టెప్పులెయ్యాలనిపించే పాటను పెట్టాడు. మెల్లగా.. కాలుకదిపాడు. ఆశావర్కర్లను జాయిన్ కావాలని ఎంకరేజ్ చేశారు. ఇంకేముంది.. అందరిలో ఓ ఉత్సాహమొచ్చింది. అందరూ కాలుకదిపారు. బీట్ పెరిగేకొద్ది స్టెప్పుల్లో స్పీడూ పెరిగింది. చుట్టూ ఆశావర్కర్లు.. మధ్యలో డీఎంహెచ్‌వో.. జోరు డ్యాన్సు.. అప్పటివరకు వాళ్లలో ఉన్న అలసత్వం మాయమైపోయి.. కొత్త ఉత్తేజం వచ్చింది. తాను అనుకున్న పనిలో ఆ డీఎంహెచ్‌వో సక్సెస్ అయ్యాడు.