Nalgonda districts Students in Ukraine : ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు వైద్య విద్యాభ్యాసంలో భాగంగా ఉక్రెయిన్‌లో ఉన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణంతో పిల్లల భద్రతపై వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికైతే ఎలాంటి ఇబ్బంది లేదని విద్యార్థులు వారి కుటుంబ సభ్యులతో వీడియో ఫోన్ కాల్‌లో చెబుతున్నారు. అయితే ఇప్పటికే విమాన సర్వీసులు నిలిచిపోయాయని, యుద్ధం తీవ్రరూపం దాల్చి సమాచార వ్యవస్థకు విఘాతం ఏర్పడితే వారి క్షేమ సమాచారం తెలియక తాము ఆదుర్దా చెందాల్సి వస్తుందని ఇక్కడి వారు వాపోతున్నారు. ఇదీ చదవండి: క్షేమంగానే ఉన్నా.. వెంటాడుతున్న బాంబుల భయం..
ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యార్థులు
Telugu Students in Ukraine : మిర్యాలగూడ పట్టణం ముత్తిరెడ్డికుంటకు చెందిన ఎల్‌ఐసీ ఉద్యోగి పెరుమాళ్ల బాలస్వామి కుమారుడు అజయ్ (మిర్యాలగూడలో సంచలనం రేపిన పరువు హత్యకు గురైన ప్రణయ్ సోదరుడు) ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చివరిలో ఉన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని మార్కెట్‌యార్డ్ కాలనీకి చెందిన ముడుంభై రామకృష్ణ, రత్నదీపల కుమారుడు ఆచార్య శేష ఫణిచంద్ర 2017లో, శ్రీరాంనగర్‌కు చెందిన గంజి సూర్యనారాయణ, సంధ్యల చిన్న కుమారుడు గంజి భానుప్రసాద్ 2019లో వైద్యవిద్య అభ్యాసానికి ఉక్రెయిన్ వెళ్లారు. అక్కడ జాఫ్రజియా వైద్య విశ్వవిద్యాలయంలో ఫణిచంద్ర ఎంబీబీఎస్ ఐదో సంవత్సరం, భానుప్రసాద్ మూడో సంవత్సరం చదువుతున్నారు. భువనగిరి పట్టణం ప్రగతినగర్ వాసి చెన్న గౌరీశంకర్ కుమారుడు పృథ్వీరాజ్ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో వోవో బొగోమెలెట్స్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నారు. ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల్‌కు చెందిన బీరవెళ్లి సంపత్‌రెడ్డి ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ ఐదో సంవత్సరం అభ్యసిస్తున్నారు. ఇదీ చదవండి:'సైరన్ మోగితే బంకర్లలోకి వెళ్లమన్నారు'.. ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థి
ఆందోళనలో కుటుంబ సభ్యులు
Ukraine Students problems : యుద్ధం పరిస్థితుల్లో ఉక్రెయిన్ తమ దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ఈ నేపథ్యంలో స్వదేశానికి తిరిగి రావడానికి విమాన టికెట్లు బుక్ చేసుకున్నా దేశ రాజధాని కైవ్ గగనతలం మూసివేయడంతో విద్యార్థులు ఆ దేశం విడిచి వెళ్లలేని పరిస్థితి ఉంది. యుద్ధంపై సామాజిక మాధ్యమాలు, సమాచార మాధ్యమాల్లో వస్తున్న వార్తలతో వారి తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. తమ పిల్లలకు భద్రత కల్పించి, సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అజయ్ తండ్రి బాలస్వామి, భానుప్రసాద్ తండ్రి సూర్యనారాయణ, ఫణిచంద్ర బాబాయ్ ముడుంభై గిరి, నెమ్మికల్‌లో సంపత్‌రెడ్డి తల్లిదండ్రులు బీరవెళ్లి వెంకటరెడ్డి, రేణుక గురువారం తమ పిల్లల క్షేమ సమాచారంపై ఆరా తీసి అనంతరం వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. సురక్షితంగా ఉన్నట్లు తమ పిల్లలు చెబుతున్నా, తమకు ఆందోళనగానే ఉందన్నారు. ఇప్పటికే కరోనాతో చదువులకు ఆటంకం కలుగగా, ఇప్పుడు యుద్ధం నెలకొనడం చదువులు ప్రశ్నార్థకంగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: ఉక్రెయిన్ అలజడిలో విద్యార్థులు.. ఆందోళనలో వారి తల్లిదండ్రులు
యుద్ధం తీవ్రమైతే ఎలా..
Ukraine Russia war 2022 updates : ఉక్రెయిన్‌లో ఉన్న యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన వైద్య విద్యార్థులు గంజి భానుప్రసాద్, ఆచార్య శేష ఫణిచంద్రతో ‘ఈటీవీ భారత్’ చరవాణి ద్వారా మాట్లాడింది. ప్రస్తుతానికి తమ ప్రాంతంలో సాధారణ పరిస్థితులే ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించినందున వైద్య విద్యాలయం నిర్వాహకులు తమను ఎక్కడికీ వెళ్లవద్దని సూచించారని చెప్పారు. వసతి గదుల్లోనే ఉంటున్నామన్నారు. విమాన సర్వీసులు ప్రారంభమైతే వెళ్లానుకునే వారిని సురక్షితంగా స్వదేశాలకు పంపుతామని చెప్పారని వెల్లడించారు. యుద్ధం తీవ్రమై ఆహారపదార్దాలు, సరకుల నిల్వలు అయిపోవడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, చరవాణి సిగ్నల్స్, అంతర్జాల సేవలు నిలిచిపోతే తమ పరిస్థితి ఏమిటనేది అర్ధం కాకుండా ఉందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ఉక్రెయిన్, రష్యా యుద్ధం- ఎవరి బలం ఎంత?