తెలంగాణ

telangana

ETV Bharat / state

అరకొర సిబ్బందితోనే జాతీయస్థాయి గుర్తింపు - mother and child care hospital in nalgonda district

నెలలో సగటున 650 వరకు ప్రసవాలు... అప్పుడే పుట్టిన పిల్లలకు సేవలందించే సంరక్షణ కేంద్రం... వందలాదిగా తరలివస్తున్నా, ఎక్కడా అపరిశుభ్రత లేకుండా జాగ్రత్తలు... ఇవీ నల్గొండ జిల్లా కేంద్రాసుపత్రికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన అంశాలు. పారిశుద్ధ్య నిర్వహణలో పాటించిన మెరుగైన విధానాలు ఈ ఆస్పత్రికి జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి.

అరకొర సిబ్బందితోనే జాతీయస్థాయి గుర్తింపు

By

Published : Sep 16, 2019, 6:18 AM IST

అరకొర సిబ్బందితోనే జాతీయస్థాయి గుర్తింపు

జాతీయ ఆరోగ్య మిషన్​ ద్వారా 'లక్ష్య' పథకానికి ఎంపికై జాతీయ స్థాయిలో తెలంగాణ దవాఖానాల ఖ్యాతిని చాటింది నల్గొండ జిల్లా కేంద్రాసుపత్రి. పారిశుద్ధ్య నిర్వహణలో సిబ్బంది, అధికారులు, గుత్తేదారులు చేస్తున్న సేవలకు జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. ఈ పథకానికి దేశం మొత్తంలో కొన్నివేల ఆస్పత్రులు పోటీ పడగా... తెలంగాణ నుంచి నల్గొండతో పాటు సంగారెడ్డి దవాఖానాలు ఈ ఘనత దక్కించుకున్నాయి.

89, 86 శాతం మార్కులు

దేశవ్యాప్తంగా ఎన్నోవేల ఆస్పత్రులను పరిశీలించిన జాతీయ ఆరోగ్య మిషన్​ ప్రతినిధులు నల్గొండ వైద్యశాలను సందర్శించారు. మే నెలలో చేపట్టిన పరిశీలన ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ తీరును లెక్కగట్టారు. నిత్యం వందలాది రోగులతో కిటకిటలాడుతున్న ఈ ఆస్పత్రి లేబర్ గదికి 89 శాతం... శస్త్రచికిత్స గది, చిన్నపిల్లల వార్డుకు 86 శాతం మార్కులు ఇచ్చారు ఎన్​సీహెచ్​ ప్రతినిధులు.

లక్ష్యతో ప్రత్యేక నిధులు

లక్ష్య పథకానికి ఎంపికవ్వడం వల్ల మూడేళ్ల పాటు పారిశుద్ధ్య నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి... 6 లక్షల రూపాయల ప్రోత్సాహక నిధులు అందుతాయి. గుర్తింపు పత్రం అందజేసిన తర్వాత కూడా... దవాఖానాలో మళ్లీ తనిఖీలు జరగనున్నాయి.

సమస్యలున్నా... గుర్తింపు సాధించారు

నిత్యం వందల మంది వస్తున్నా... కావల్సినమంత మంది వైద్యులు లేరు. 150 పడకలున్న మాతాశిశు సంరక్షణ కేంద్రంలో... నలుగురు డాక్టర్లే ఉన్నారు. అందులో ఒక్కరే ఓపీ చూస్తుండగా... మిగతా ముగ్గురు ఆపరేషన్ థియేటర్లో పనిచేస్తుంటారు. వైద్య కళాశాల ఏర్పాటైన తర్వాత తాత్కాలిక పద్ధతిన సిబ్బంది సేవలు లభిస్తున్నా... అవి పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల సమస్య తలెత్తుతోంది. అరకొర సిబ్బందితో నెట్టుకొస్తూనే... లక్ష్య పథకానికి ఎంపిక కావడం ఆస్పత్రి పనితీరుకు అద్దం పడుతోంది.

ABOUT THE AUTHOR

...view details