Nalgonda Congress Leaders Join BRS :యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, భువనగిరి కాంగ్రెస్ ఇన్‌ఛార్జి అనిల్ కుమార్‌రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్లడంతో రాష్ట్రంలోనే సంస్థాగతంగా బలంగా ఉన్న జిల్లాల్లో ఒకటైన ఉమ్మడి నల్గొండలో.. ఆ పార్టీకి షాక్ తగిలింది. భువనగిరిలో నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన అనిల్.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీకి నష్టం కలిగిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
Congress Leader Joins BRS Party :2018 అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీచేసి ఓడిపోయిన అనిల్ కుమార్‌రెడ్డి.. ఎంపీ కోమటిరెడ్డికి మధ్య చాలాకాలంగా విభేదాలున్నాయి. ఇటీవల ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న ఆయన.. నియోజకవర్గంలో బీసీవాదం పేరుతో పలువురు అసమ్మతి కార్యక్రమాలు చేస్తుండటంతో మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. దాని వెనక ఎంపీ కోమటిరెడ్డి ఉన్నారని బాహాటంగానే విమర్శిస్తున్నారు. పీసీస మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డికి అనిల్ అనుచరుడిగా ఉన్నారు. భువనగిరి అసెంబ్లీ నుంచి.. ప్రస్తుతం శేఖర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా, తిరిగి ఆయనకే అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. అనిల్ కుమార్‌రెడ్డికి ఎంపీ టికెట్ హామీ లభించినట్లు సమాచారం.
"అనిల్ కుమార్‌రెడ్డికి రాజకీయ భవిష్యత్ చాలా బాగుంటుంది. ఇవాళ యాదాద్రి భువనగిరిలో పార్టీ జిల్లా కేంద్రం పెట్టుకున్నాం. యాదాద్రిని బాగా అభివృద్ధి చేశాము. ఇంకా అక్కడ జరగాల్సిన పనులు చాలా ఉన్నాయి. శేఖర్‌రెడ్డి, అనిల్ కుమార్‌రెడ్డి ఇద్దరు కలిసి ఆ జిల్లాలో అద్భుతంగా పని చేయాలని కోరుతున్నా. శేఖర్‌రెడ్డికి చెబుతున్నా.. పాతవాళ్లు, కొత్తవాళ్లు అని పొంతనలు పెట్టుకోవద్దు.. ఇద్దరు గౌరవించుకుంటూ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ప్రజలకు సేవ చేస్తేనే వారికి గుర్తుంటది.. అందరూ పాలన మంచిగా ఉంది అనుకోవాలి."-కేసీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి