నూతన పురపాలికగా అవతరించిన నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో.. పార్టీల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. 21,382 మంది ఓటర్లున్న పురపాలికలో.. 20 వార్డులకు 40 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 800 మంది సిబ్బంది విధుల్లో పాలుపంచుకోనున్నారు. అధికార తెరాస, విపక్ష కాంగ్రెస్, భాజపాతో పాటు.. గులాబీ పార్టీ అసమ్మతిదారులు ఎన్నికల్లో తలపడుతున్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ శాసనసభ్యుడు వేముల వీరేశం మద్దతుదారుల మధ్య సాగుతున్న పోరు.. ఎన్నికల్ని రసవత్తరంగా మార్చే అవకాశం కనిపిస్తోంది. తెరాస 20 వార్డుల్లోనూ అభ్యర్థులను నిలిపగా... అసమ్మతి వర్గీయులు ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ పేరిట 14 వార్డుల్లో పోరుకు సై అంటున్నారు. కాంగ్రెస్ 16 చోట్ల, భాజపా 14 వార్డుల్లో, సీపీఎం- 3 స్థానాల్లో, తెదేపా ఒక వార్డులో పోటీ పడుతున్నారు.
మంత్రి మకాం
తెరాస అభ్యర్థుల గెలుపు కోసం మంత్రి జగదీశ్‌రెడ్డి... గత నాలుగు రోజుల నుంచి నకిరేకల్‌లోనే మకాం వేశారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా.. మూణ్నాలుగు వార్డులకో సమావేశం నిర్వహిస్తూ అందరినీ కలుసుకుంటున్నారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే గాదరి కిశోర్... స్థానిక శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మద్దతుదారులు.. రెబెల్స్‌గా పోటీలో ఉన్నారు. 20 వార్డులకు గాను 14 చోట్ల పోటీ చేస్తూ అధికార పార్టీకి సవాల్‌గా మారారు. ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ నుంచి బీ-ఫారాలు పొంది... సింహం గుర్తుపై బరిలో నిలిచారు. శాసనసభ్యుడు చిరుమర్తి, మాజీ ఎమ్మెల్యే వీరేశం మధ్య కొనసాగుతున్న ఆధిపత్య ధోరణి.. ఎన్నికల్ని ఆసక్తికరంగా మారుస్తోంది.