పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలకు కైవసం చేసుకుని ఉత్సాహంతో ఉన్న తెరాస నాగార్జునసాగర్ ఉపఎన్నికపై దృష్టి పెట్టింది. తెరాస ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మరణంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు తెరాస ఎత్తులు పై ఎత్తులు వేస్తోంది. నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, మండలాల వారీగా మంత్రులు, సీనియర్ నేతలను ఇంఛార్జిలుగా నియమించి రంగంలోకి దించింది. అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికే నిర్వహించిన పలు సర్వేలతో పాటు.. స్థానిక రాజకీయ, సామాజిక సమీకరణలను విశ్లేషిస్తోంది.
ప్రచారంలో ముందున్న జానారెడ్డి
కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి, సీనియర్ జానారెడ్డి ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ప్రధాన పోటీ అని భావిస్తున్న తెరాస... జానారెడ్డిని అన్ని కోణాల్లో ఎదుర్కోవాలని వ్యూహరచన చేస్తోంది. తెరాస నుంచి దాదాపు పది మంది నేతలు టికెట్ రేసులో ఉన్నారు. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులకు ఇవ్వాలా.. లేక నోముల సామాజికవర్గం యాదవుల్లో ఇతరులకు ఇవ్వాలా.. లేక జానారెడ్డిని సామాజికవర్గం కోణంలో ఎదుర్కొనేందుకు రెడ్డి వర్గం నుంచి ఇవ్వాలా అనే అంశాలను కొన్నాళ్లుగా తెరాస బేరీజు వేస్తోంది.
నోములు కుటుంబ సభ్యులకు లేకుంటే రెడ్డి సామాజిక వర్గానికి
నోముల నర్సింహయ్య కుటుంబం లేదా రెడ్డి సామాజిక వర్గం నుంచి ప్రముఖ నేతను బరిలోకి దించాలని గులాబీ పార్టీ దాదాపు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తెరాస అధినేత, సీఎం కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలో ఇప్పటికే పలుమార్లు సమావేశమై చర్చించారు. నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ వైపే ఎక్కువగా మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. నోముల నర్సింహయ్య కుటుంబంపై సానుభూతితో పాటు బీసీ, యాదవ సామాజికవర్గాలకు పెద్దపీట వేసిన గుర్తింపు ఉంటుందని పార్టీ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.