Nagarjuna Sagar Post Office Fraud Update : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో ఫైలన్ కాలనీలో పోస్టాఫీస్‌లో దాదాపు రూ.కోటిన్నర వరకు ఖాతాదారుల ఖాతాల్లో నుంచి నగదు మాయమైనట్లు తెలుస్తోంది. పోస్ట్ మాస్టర్ రామకృష్ణ ఖాతాదారుల ఖాతాల్లో నగదు మాయం చేసిన ఘటనలో తవ్వే కొద్ది అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. తమ ఖాతాల్లో నగదు మాయం కావడంతో ఖాతాదారులు నిర్ఘాంత పోతున్నారు. తమ కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా డబ్బులను పోస్టాఫీస్‌లో దాచుకుంటే అక్కడ కూడా భద్రత లేకుండా పోయిందని ఖాతాదారులు వాపోతున్నారు.
ఈ నగదు స్వాహా విషయం వెలుగులోకి వచ్చి దాదాపు 20 రోజులు కావొస్తున్న సంబంధిత అధికారులు విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని బాధితులు అంటున్నారు. దాదాపు రూ. కోటిన్నర వరకు ఖాతాదారులు నగదు మాయం అయినట్టు తెలుస్తోంది. ఇందులో ఫిక్సిడ్, రికరింగ్ డిపాజిట్లు ఉన్నాయి. పోస్టు మాస్టర్ రామకృష్ణపై గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయని, అయినా మళ్లీ అతన్నే విధుల్లోకి తీసుకొచ్చారని బాధితులు ఆరోపిస్తున్నారు. పోస్ట్ మాస్టర్ రామకృష్ణ ఖాతాదారులు నగదు చెల్లింపుల, జమలకు వారి ఫోన్ నంబర్ కాకుండా తన ఫోన్ నంబర్ నమోదు చేసుకుని ఈ నగదును మాయం చేసినట్లు తెలిసింది.
నాగార్జునసాగర్ పోస్ట్ ఆఫీస్‌లో పోయింది రూ.20 లక్షలు కాదు 40 లక్షలకు పైనే
నేను ఖాతాలో రూ. రెండు లక్షల డెబ్బై వేలు జమ చేశా. డబ్బులు మాయమైందని విషయం తెలిసిన తర్వాత పోస్ట్ ఆఫీస్ అధికారులను నా ఖాతా వివరాలు అడిగాను. కానీ ఖాతాలో రూ.12 వేలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. అదేంటని అడిగితే హెడ్‌ఆఫీస్‌కు వెళ్లండి అని చెబుతున్నారు. మీ ఖాతా డబ్బుల గురించి విచారణ జరుగుతోందని అంటున్నారు - పోస్టాఫీస్ ఖాతాదారుడు