Nagarjuna sagar Political War 2023 :ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక కాలం మంత్రిగా, తెలంగాణ తొలి అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి రికార్డు సృష్టించిన సీనియర్ నేత జానారెడ్డికి నాగార్జునసాగర్ కంచుకోట లాంటిది. 2018 ఎన్నికల్లో జానారెడ్డిపై గెలిచిన బీఆర్ఎస్అభ్యర్థి నోముల నర్సింహయ్య 2020లో మృతి చెందటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2021లో నోముల భగత్... జానారెడ్డిపై 18వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే, ఈసారి ఎన్నికల్లో జానారెడ్డి కుమారుడు కుందూరు జైవీర్ రెడ్డి పోటీలో నిలిచారు. భగత్, జైవీర్ ఇద్దరూ యువ నాయకులే కావటం, బలమైన వారసత్వం, క్యాడర్ మద్దతు ఉండటంతో పరిస్థితి నువ్వా నేవా అన్నట్లుగా మారింది.
Nomula Bhagat Vs Jaiveer Reddy in Nagarjuna sagar 2023 :నాగార్జునసాగర్‌లో 2018, 2021లో రెండు సార్లు గెలుపొందిన బీఆర్ఎస్.. మరోసారి సత్తా చాటలని భావిస్తోంది. గ్రూప్ తగాదాలు గెలుపు అవకాశాలను సన్నగిల్లేలా చేస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో కొంత అయోమయం నెలకొంది. ఇదే అదునుగా కాంగ్రెస్ చేరికలను ప్రోత్సహిస్తోంది. అటు ఎమ్మెల్సీ కోటిరెడ్డి వర్గం, నోముల భగత్‌కు ఎంతమేరకు సహకరిస్తోందోనన్న చర్చ సైతం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇటీవలే మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో అసంతృప్త నేతలను బుజ్జగించిన నోముల భగత్... ప్రచారంలో దూసుకుపోతున్నారు.
BRS Vs Congress in Nagarjuna sagar 2023 : మూడేళ్లలో తాను చేసిన అభివృద్ధి, కేసీఆర్ సంక్షేమ పథకాలే మరోసారి గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా నాగార్జునసాగర్ నుంచే పోటీ చేస్తున్న సీనియర్ నేత జానారెడ్డి... ఈసారి తన చిన్న కుమారుడు జైవీర్‌ను బరిలోకి దింపారు. 1978 నుంచి వరుసగా 11 సార్లు పోటీ చేసి 7సార్లు విజయం సాధించారు. వరుసగా రెండు సార్లు ఓటమి పాలైనా... కాంగ్రెస్ ఓటు బ్యాంకు స్థిరంగానే ఉంది. ఈసారి ఎలాగైన గెలుపు సాధించాలని హస్తం శ్రేణులు గట్టి పట్టుదలతో ఉన్నాయి. ఇప్పటికే ప్రచార బరిలోకి దిగిన జైవీర్... గిరిజన చైతన్య యాత్ర పేరుతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. తన తండ్రి హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మరోసారి కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.