నాగార్జునసాగర్ జలాశయానికి(Nagarjuna Sagar Dam) వరద పోటెత్తుతోంది. సోమవారం రోజున సాగర్ నీటిమట్టం గరిష్ఠస్థాయి 590.00అడుగులకు చేరగా.. అధికారులు 10 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇందులో 4 గేట్లను 5 అడుగుల మేర, మరో 6 గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి స్పిల్ వే ద్వారా లక్షా 22వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.
Nagarjuna Sagar Dam : సాగర్‌కు కొనసాగుతున్న వరద.. 10 గేట్లు ఎత్తి నీటి విడుదల - నాగార్జునసాగర్ డ్యామ్
నాగార్జునసాగర్ జలాశయానికి(Nagarjuna Sagar Dam) వరద ప్రవాహం కొనసాగుతోంది. సాగర్ నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరగా.. అధికారులు 10 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయంలో ప్రస్తుతం 311.14 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
సాగర్(Nagarjuna Sagar Dam) ఇన్‌ఫ్లో లక్షా 71వేల 991 క్యూసెక్కులు ఉండగా.. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 29,313 క్యూసెక్కుల నీటిని... కుడి, ఎడమ కాలువలకు సాగు నీరు 17వేల క్యూసెక్కులు, ఎమ్మార్పీ కాలువకు 2400 క్యూసెక్కులు, లోలెవల్ కాలువకు 400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. నాగార్జునసాగర్ జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు ప్రస్తుతం 589.70 అడుగులు ఉంది. మొత్తం నీటినిల్వ 312.04 టీఎంసీలకు గాను.. 311.14 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది.
శ్రీశైలం జలాశయానికి (Srisailam dam)వరద ప్రవాహం కొనసాగుతోంది. నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో అధికారులు నాలుగు గేట్లను ఎత్తారు. స్పిల్ వే ద్వారా 1,11,932 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి 1,29,038 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం ప్రస్తుత నీటి మట్టం 884.80 అడుగులు ఉండగా.. 214.36 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. విద్యుదుత్పత్తి చేసి అదనంగా 64,603 క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదల చేస్తున్నారు.