తెలంగాణ

telangana

ETV Bharat / state

NAGARJUNA SAGAR:  నాగార్జున సాగర్‌ 14 గేట్లు ఎత్తివేత - telangana varthalu

నాగార్జున సాగర్​ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో సాగర్​ జలాశయం నిండుకుండలా మారింది. ఈ నేపథ్యంలో అధికారులు సాగర్​ గేట్లను ఎత్తారు. క్రస్టు గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్​ క్రస్టు గేట్లు ఎత్తడంతో పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.

NAGARJUNA SAGAR:  నాగార్జున సాగర్‌ 14 గేట్లు ఎత్తివేత
NAGARJUNA SAGAR:  నాగార్జున సాగర్‌ 14 గేట్లు ఎత్తివేత

By

Published : Aug 1, 2021, 7:28 PM IST

Updated : Aug 1, 2021, 8:22 PM IST

నాగార్జునసాగర్‌లో కృష్ణమ్మ సందడి మొదలైంది. శ్రీశైలం నుంచి భారీగా వరదనీరు వస్తుండటంతో నాగార్జున సాగర్‌ జలాశయం నిండుకుండలా మారింది. దీంతో అధికారులు ఈరోజు సాయంత్రం 14 క్రస్టు గేట్లను 5అడుగుల మేరకు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్​ జలాశయానికి 4 లక్షల 64వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వచ్చి చేరుతుండగా.. క్రస్టు గేట్లు ఎత్తి లక్షా 6వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 298 టీఎంసీలుగా ఉంది. నాగార్జునసాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 584 అడుగులుగా ఉంది. ఏఎంఆర్​పీకి అధికారులు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

మధ్యాహ్నం ఎడమ కాలువకు నీటి విడుదల

ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ రోజు మధ్యాహ్నం నాగార్జున సాగర్ ఎడమకాలువకు నీటి విడుదల చేశారు. వానాకాలం పంటసాగు కోసం ఎమ్మెల్యే నోముల భగత్‌, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యతో కలిసి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా... దానిని అధికారులు 600క్యూసెక్కులకు పెంచారు. దశలవారీగా నీటి విడుదల పెంచుతామని అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్‌ జలాశయానికి భారీ వరద రావడంతో... ఎడమ కాలువ నీటికి విడుదల చేశారు. గతేడాది ఆగస్టు 11న సాగర్‌ ఎడమకాల్వకు నీరు ఇవ్వగా... ఈ ఏడాది పదిరోజుల ముందే నీటి విడుదల చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

భారీగా తరలివస్తున్న పర్యాటకులు

సాగర్​ క్రస్టు గేట్లు ఎత్తడంతో పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. అధికారులు గేట్లు ఎత్తుతుండగా.. ఆ ప్రవాహాన్ని చూసి కేరింతలు కొట్టారు. భారీ ప్రవాహం నేపథ్యంలో పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. కరోనా నేపథ్యంలో మాస్కులు ధరించాలని సూచించారు.

భారీ వరద

శ్రీశైలం, సాగర్‌, పులిచింతల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు ప్రకాశం బ్యారేజ్‌కి వస్తుంది. ఇవాళ సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్‌కు సుమారు లక్ష క్యూసెక్కులు, రేపటి వరకు సుమారు 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందని ఏపీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉన్నందున కృష్ణా నది తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.

ఇదీ చదవండి:NSP: శ్రీశైలం, సాగర్‌ జలాశయాలకు వరద.. సాగర్‌ ఎడమ కాల్వకు నీటి విడుదల

Last Updated : Aug 1, 2021, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details