విమర్శలు, ప్రతివిమర్శలతో వేడెక్కిన సాగర్ ప్రచారం నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో పార్టీలు మరింత జోరు పెంచాయి. ప్రధాన పార్టీల నుంచి ముఖ్యనేతలందరూ బరిలోకి దిగారు. పల్లెలు, పట్టణాల్లో తిరుగుతూ ఓటర్లను కలుసుకుంటున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే అజెండగా తెరాస ప్రచారంలోకి దూసుకెళ్తోంది. అభ్యర్థి నోముల భగత్‌కు మద్దతుగా అనుముల మండలంలోని పాలెంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్ ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలుసుకున్న నేతలు... నియోజకవర్గ అభివృద్ధి కోసం తెరాసను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఫలితం శూన్యమని విమర్శించారు.
ప్రశ్నించేందుకు జానారెడ్డిని గెలిపించాలి
అధికార పార్టీ వైఫల్యాలపై విమర్శలు గుప్పిస్తూ విపక్షాలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి తరఫున ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రచారం చేశారు. తిరుమలగిరి మండలం ఎర్రచెరువు, గొడుమడక, నాయకునితండా, తిమ్మాయిపాలెం, చింతలపాలెంలోని ఓటర్లను కలుసుకున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులన్నీ జానారెడ్డి హయంలోనే జరిగాయన్న రేవంత్... అధికార పార్టీ వైఫల్యాలను ప్రశ్నించేందుకు జానారెడ్డిని గెలిపించాలని కోరారు.
కేంద్ర నిధులతోనే..
తిరుమలగిరి మండలం నెల్లికల్ గ్రామంతోపాటు పలు తండాల్లో.... భాజపా అభ్యర్థి రవికుమార్‌కు మద్దతుగా ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి ప్రచారం నిర్వహించారు. అభ్యర్థి రవికుమార్ నాయక్‌తో కలిసి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ నియోజకవర్గంలో పర్యటించారు. గుర్రంపోడు, కొప్పోలు, ఒద్దిరెడ్డిగూడెం గ్రామాల్లోని ఓటర్లను కలుసుకున్నారు. కొప్పోలులో రోడ్ షో నిర్వహించిన బండి సంజయ్‌కి పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. నియోజకవర్గ అభివృద్ధిని తెరాస పట్టించుకోలేదన్న సంజయ్... కేంద్రం ఇచ్చే నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని స్పష్టంచేశారు.