నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు భాజపా నాయకులు నలుగురు టికెట్ ఆశిస్తుండగా.. అంజయ్యయాదవ్, రవినాయక్‌ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో భాజపా తరఫున పోటీ చేసిన నివేదితారెడ్డి ఇప్పటికే నామినేషన్ వేసినా ఆమెకు టికెట్ దక్కే అవకాశాలు అతిస్వల్పమేనని సమాచారం. మరో నేత ఇంద్రసేనారెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. చివరిరోజైన 30న పార్టీ అభ్యర్థి నామినేషన్ ఉంటుందని, అదేరోజు బి-ఫాం ఇస్తామని పార్టీ నేత ఒకరు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తున్న భాజపా ముగ్గురు సీనియర్‌నేతలతో ఓ ఉపకమిటీని వేసింది.
సాగర్ నుంచి పోటీకి ఆ నలుగురు సిద్ధం.. మరి టికెట్ ఎవరికో! - ఉప ఎన్నికలు
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిని భాజపా మంగళవారం ఖరారు చేయనుంది. తెరాస అభ్యర్థిని బట్టి సామాజిక సమీకరణాల ఆధారంగా ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఓ ప్రధానపార్టీకి చెందిన ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేత కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
భాజపా అభ్యర్థి ఎవరో!
ప్రచారానికి 30 మంది ప్రముఖులు
ఉప ఎన్నికలో ప్రచారం కోసం రాష్ట్రానికి చెందిన 30 మంది నేతలతో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను భాజపా ఆదివారం వెల్లడించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, సీనియర్ నాయకురాలు విజయశాంతితోపాటు ఓ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ జాబితాలో ఉన్నారు.