nagarjuna sagar 26 gates open: ఎగువనుంచి వస్తున్న ప్రవాహంతో నాగార్జున సాగర్ కళకళ సంతరించుకుంది. ఇప్పటికే జలాశయం నిండటంతో 26 క్రస్ట్ గేట్లలో 2 గేట్లని 5 అడుగుల మేరకు, 24 గేట్లని 10 అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌కు ప్రస్తుతం ఇన్ ఫ్లో 3 లక్షల 22 వేల 931 క్యూసెక్కులుగా ఉంది. ఔట్ ఫ్లో 4 లక్షల 3వేల 70 క్యూసెక్కులు. నీటి ప్రవాహం ఆధారంగా గేట్లను ఎత్తును తగ్గించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.
పర్యటకుల సందడి:నాగార్జున సాగర్ మొత్తం నీటి మట్టం 590 అడుగులకు ప్రస్తుతం 585.60 అడుగులుగా ఉంది. పూర్తి నిల్వ సామర్ధ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 298.98 టీఎంసీలకు చేరింది. 26 క్రస్ట్ గేట్లను ఎత్తడంతో పర్యటకుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. అందుకు తగ్గట్లుగా ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.