Munugode Bypoll Schedule: ఓ వైపు జాతీయ రాజకీయాల్లోకి అడుగులు పెట్టేందుకు సిద్ధమైన గులాబీ దళం. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కసరత్తులు చేస్తున్న కమలదళం. చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధమైన హస్తం పార్టీ. విజయదశమికి రెండ్రోజుల ముందు వెలువడిన ఉపఎన్నిక షెడ్యూలతో.. రాష్ట్రంలో రాజకీయ సందడి నెలకొంది. నల్గొండ జిల్లా మునుగోడు శాసనసభ్యత్వానికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఈ ఉపఎన్నిక అనివార్యమవుతోంది.
మునుగోడు ఉప ఎన్నిక పోరును ప్రధానంగా భావిస్తున్న పార్టీలు:వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ముందు జరగనున్న ఈ పోరును ప్రధాన పార్టీలు కీలకంగా భావిస్తున్నాయి. కాంగ్రెస్‌ను వీడిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. కాషాయ కండువా కప్పుకున్న రాజగోపాల్‌రెడ్డి భాజపా అభ్యర్థిగా బరిలోగి దిగనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ దివంగత నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి ఖరారు కాగా.. అధికార తెరాస ఇప్పటి వరకు తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదు.
మునుగోడు ఉపఎన్నికతోనే జాతీయ పోరు: విజయదశమి వేళ జాతీయ పార్టీ ప్రకటనకు సిద్ధమైన ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు ఉపఎన్నికతోనే జాతీయ పోరును ప్రారంభించాలని నిర్ణయించారు. మునుగోడులో గత ఎన్నికల్లో ఓటమి పాలైన అధికార పార్టీ రాజగోపాల్‌రెడ్డి తీరుతో ఉప ఎన్నికలు వస్తాయనే తొలి నుంచి అంచనాతో ఉంది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌తో ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు పలు దఫాలు సమావేశం కావటం కేటీఆర్ వరుసగా భేటీలు జరుపుతూ సమాయత్తం చేశారు.
ప్రత్యేక వ్యూహాలతో తెరాస: నియోజకవర్గంలోని పెండింగ్ సమస్యలపై దృష్టి సారించటంతో పాటు గట్టుప్పల్ మండలాన్ని ప్రకటించారు. మరోవైపు నియోజకవర్గంలోని బలమైన నేతలను పార్టీలోకి చేర్చుకుంటూ వచ్చారు. అధికారంలోకి వచ్చాక జరిగిన ఉప ఎన్నికల్లో దుబ్బాక, హుజూరాబాద్‌లలో ఓటమి పాలైన నేపథ్యంలో మునుగోడులో గెలుపును పార్టీ కీలకంగా భావిస్తోంది.
ఆ నియోజకవర్గాల్లో ఎదురైన అనుభవాలను గుణపాఠంగా తీసుకొని ముందుకు సాగాలని భావిస్తోంది. గత ఉపఎన్నికల్లా కాకుండా ఈ సారి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సైతం మునుగోడులో బహిరంగసభకు హాజరయ్యారు. అభ్యర్థి ఎంపిక, ప్రచారం, అంచనాలు తదితర అంశాలపై ప్రత్యేక వ్యూహాలతో తెరాస ముందుకుసాగుతోంది. జాతీయ రాజకీయాల్లోకి అడుగులు వేస్తున్న సమయంలో రాష్ట్రంలో వచ్చిన తొలి సమరంలో గెలుపే లక్ష్యంగా తెరాస వ్యూహాలు పన్నుతోంది.
గత ఎన్నికల్లో పోటీ చేసిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో పాటు మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడైన అమిత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌తో పాటు మరికొందరు నేతలు ఇక్కడి తెరాస టికెట్ ఆశిస్తున్నారు. కూసుకుంట్లకు టికెట్ ఇవ్వొద్దంటూ పార్టీ అసంతృప్తి చెలరేగిన వేళ.. అధినేతతో జరిగిన చర్చలతో నేతలంతా ఏకతాటిపైకి వచ్చినట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో తెరాస అభ్యర్థిత్వం ఇప్పటికీ అధికారికంగా ప్రకటించకపోవటంతో ఎవరికి టికెట్ వస్తుందో అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.