Munugode By poll Voting : మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులుతీరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. ప్రశాంతమైన వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్ నమోదు కాగా.. 11 గంటల వరకు 25.8 శాతం ఓటింగ్ నమోదైంది. ఇదిలా ఉండగా.. మునుగోడు నియోజకవర్గం నాంపల్లిలోని 294వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం కాసేపు మొరాయించింది. నాంపల్లితో పాటు ఒకట్రెండు కేంద్రాల్లో ఈవీఎంలలో సమస్యలు తలెత్తాయి. సిబ్బంది వెంటనే ఈవీఎంలను సరిచేసి పోలింగ్ కొనసాగిస్తున్నారు.
చండూరులో స్వల్ప ఉద్రిక్తత..: నల్గొండ జిల్లా చండూరులో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో స్థానికేతరులు ఉన్నారని భాజపా శ్రేణులు ఆరోపించారు. ఘటనాస్థలికి వెళ్లడంతో స్థానికేతరులు పరారయ్యారని తెలిపారు. అదే సమయంలో ఘటనా స్థలికి వెళ్లిన తెరాస కార్యకర్తలు.. స్థానికేతర భాజపా శ్రేణులు నియోజకవర్గంలో ఉన్నారని ఆరోపించడంతో తెరాస, భాజపా శ్రేణుల మధ్య వాగ్వాదం, స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
ఓటేసిన కూసుకుంట్ల, పాల్వాయి స్రవంతి..: నారాయణపురం పరిధి లింగవారిగూడెంలో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఓటు వేశారు. సతీసమేతంగా పోలింగ్ కేంద్రానికి వచ్చిన కూసుకుంట్ల.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఓటింగ్ జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. ఈ క్రమంలోనే పోలింగ్ సజావుగా జరుగుతుందన్న ఆయన.. ఏర్పాట్లపై హర్షం వ్యక్తం చేశారు. చండూరు మండలం ఇడికూడలో కాంగ్రెస్ అభ్యర్థి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 173వ పోలింగ్ కేంద్రంలో పాల్వాయి స్రవంతి ఓటు వేశారు.
ఆరా తీసిన బండి సంజయ్..: మునుగోడు ఎన్నికల పోలింగ్ సరళిపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరా తీశారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి పోలింగ్ సరళిపై స్థానిక కార్యకర్తలను అడిగి వివరాలు తెలుసుకున్నారు.