Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి జగన్నాథ్‌రావును కేంద్రఎన్నికల సంఘం తప్పించడంతో మరోసారి ఎన్నికలవిధుల్లో అధికారుల పాత్రపై చర్చ సాగుతోంది. 2019 అక్టోబరులో హుజూర్‌నగర్ ఉప ఎన్నికలప్పుడు అప్పటి సూర్యాపేట ఎస్పీ వెంకటేశ్వర్లు.. క్షేత్రస్థాయిలో అధికార తెరాసకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీఈసీకి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
దీంతో ఆయనను ఉప ఎన్నిక విధుల నుంచి తప్పించింది. వెంకటేశ్వర్లు స్థానంలో సూర్యాపేట ఎస్పీగా భాస్కరన్‌ను నియమించింది. తాజాగామునుగోడు ఉపఎన్నిక ఆర్వోగా ఉన్న జగన్నాథ్‌రావును తప్పిస్తూ నాగార్జునసాగర్ ఉపఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా పనిచేసిన మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్‌సింగ్‌ను నియమించింది. యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్‌కు తొలుత లాటరీపద్ధతిలో రోడ్ రోలర్ గుర్తు కేటాయిస్తూ అభ్యర్థి నుంచి సంతకం చేసిన ప్రతిని ఆర్వో తీసుకున్నారు.
అనంతరం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మరో గుర్తు కేటాయించడంపై ఉన్నతస్థాయి నుంచి వచ్చిన ఒత్తిళ్లే కారణమన్న వాదన వ్యక్తమవుతోంది. ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే తనపై ఎన్నికల సంఘం వేటువేసే అవకాశం ఉందని.. అక్కడే ఉన్న పలువురు ఎన్నికల సిబ్బందితో ఆర్వో జగన్నాథ్‌రావు చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఇతర గుర్తు కేటాయింపుపై ఎన్నికల సంఘానికి స్వతంత్ర అభ్యర్థుల ఫిర్యాదు వెనుక ఓ ప్రధాన పార్టీకి చెందిన ముఖ్యనేత చక్రం తిప్పినట్లు సమాచారం.
అవసరమైతే వారిని దిల్లీకి తీసుకెళ్లి సీఈసీ ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని భావించారు. ఈ సమయంలోనే ఈసీకి చెందిన కార్యదర్శి వ్యాస్ హైదరాబాద్ రావడం, ఆయన్ను కలిసి ఫిర్యాదు చేయడం.. తిరిగి శివకుమార్‌కు రోడ్‌రోలర్ గుర్తును కేటాయించాలని జిల్లా ఎన్నికల అధికారిని ఆదేశించడం చకచకా జరిగిపోయింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్‌రోలర్ గుర్తు కేటాయింపుపై ఈసీ నుంచి ఉత్తర్వులు వచ్చాయని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వెల్లడించారు.