తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలని వెంకట్‌రెడ్డి ఆయనకు ఫోన్‌..!

MPTC Husband Allegations on Venkat Reddy : మునుగోడులో రాజకీయం రోజురోజుకు వేడి రాజుకుంటోంది. ఇప్పటి ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్, భాజపాలు ప్రచారపర్వాన్ని మొదలు పెట్టాయి. ఈ క్రమంలోనే ఓ ఎంపీటీసీ సభ్యురాలి వ్యాఖ్యలు నియోజకవర్గంలో దుమారం రేపాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..?

MPTC Allegations on MP Komatireddy Venkat Reddy
MPTC Allegations on MP Komatireddy Venkat Reddy

By

Published : Sep 8, 2022, 9:12 AM IST

MPTC Husband Allegations on Venkat Reddy : మునుగోడులో భాజపా నుంచి పోటీ చేస్తున్న తన సోదరుడు రాజగోపాల్‌ రెడ్డిని గెలిపించాలని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పదే పదే వాట్సప్‌ కాల్‌ చేసి ఇబ్బంది పెడుతున్నారని నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండి ఎంపీటీసీ సభ్యురాలు పోలగోని విజయలక్ష్మి భర్త సైదులు ఆరోపించారు. ఊకోండిలో మండల ఇన్‌ఛార్జి, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు బుధవారం ఏర్పాటు చేసిన గ్రామస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మండలంలో చాలా మంది కాంగ్రెస్‌ నేతలకు వెంకట్‌రెడ్డి ఇలా ఫోన్‌ చేస్తున్నారని, కానీ బయటికి చెప్పేందుకు వారు ధైర్యం చేయడం లేదని తెలిపారు.

మరోవైపు మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్‌ ఈ నెలాఖరులో వచ్చే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో అధికార తెరాసతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌, భాజపాలు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో తక్షణం ఇంటింటికీ ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించాయి. ఈ మేరకు అన్ని పార్టీలు వ్యూహాలు ఖరారు చేస్తున్నాయి. సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకునే వ్యూహంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ గురువారం నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా గడప గడపకు కాంగ్రెస్‌ కార్యక్రమాన్ని పార్టీ ప్రారంభించింది.

మునుగోడు ఉపఎన్నికలో విజయం సాధించి రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సరికొత్త ఉత్సాహంతో ముందుకెళ్లాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. అభ్యర్థి ఎంపికపై రాష్ట్ర స్థాయిలో ప్రక్రియ పూర్తిచేసిన పీసీసీ ఏఐసీసీకి నివేదించింది. ఈ నేపథ్యంలో అభ్యర్థి ప్రకటనతో సంబంధం లేకుండా ప్రచార బరిలోకి దిగింది. నాయకుల మధ్య విబేధాలు లేవని ఐక్యంగా ఉన్నామనే సంకేతాలను పార్టీ శ్రేణుల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేకచర్యలు చేపట్టారు.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న భాజపా జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి అన్ని విధాలుగా అండగా ఉండేందుకు సిద్దమైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే మునుగోడును సెమీ ఫైనల్‌గా భావిస్తున్నతరుణంలో ప్రచార కార్యక్రమాల ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం, అధికార తెరాసను ఓడించాలంటే ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలన్నదానిపై జాతీయ నాయకత్వం కసరత్తు ముమ్మరం చేసింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, మోదీ సంక్షేమ పాలనను ప్రజల ముందు ఆవిష్కరించడంతో పాటు.. తెరాస వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని నిర్ణయించింది.

ABOUT THE AUTHOR

...view details