కేంద్ర ప్రభుత్వ పథకాల్ని.. రాష్ట్ర ప్రభుత్వం తన కార్యక్రమాలుగా ప్రచారం చేసుకుంటోందని పార్లమెంటరీ వ్యవహారాలు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ ఆరోపించారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికల భాజపా అభ్యర్థి రవికుమార్‌నాయక్‌కు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. జనరల్ స్థానంలో ఎస్టీ అభ్యర్థికి టికెట్ ఇచ్చిన ఘనత భాజపాదేనని చెప్పారు. ఉపఎన్నికలో భాజపా గెలుపు చరిత్రలో నిలిచిపోవాలన్నారు. పక్కనే భారీ ప్రాజెక్టు ఉన్నా... సాగర్ నియోజకవర్గ ప్రజలకు నీరందకపోవటం శోచనీయమన్నారు. తెరాస పాలనలో వ్యవస్థలన్నీ అవినీతిలో కూరుకుపోయాయని.. కేంద్ర పథకానికే కేసీఆర్ కిట్ అని పేరు పెట్టుకున్నారని ఆరోపించారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. కానీ, ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధికి, సంక్షేమ పథకాలకు నోచుకోవటం లేదు. మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అన్ని అంశాల్లో అడుగడుగునా అవినీతి పేరుకుపోయింది. టీఎస్‌పీఎస్‌సీకి కనీసం ఛైర్మన్ కూడా లేని పరిస్థితి. అక్కడున్న సభ్యుడే ఛైర్మన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగ కల్పన ఎలా సాధ్యమవుతుంది. జనరల్‌కు కేటాయించిన స్థానంలో ఎస్టీ అభ్యర్థి రవికుమార్‌నాయక్‌కు భాజపా టికెట్ ఇచ్చింది. మా అభ్యర్థికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ ఉపఎన్నికలో భాజపా గెలుపు చరిత్రలో నిలిచిపోవాలి.