మునుగోడు నియోజకవర్గంలోని పలివెలలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రచారాన్ని కొందరు అడ్డుకుంటే రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోందని మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. పథకం ప్రకారం తన కాన్వాయ్‌పైనా దాడి చేశారని ఆయన ఆరోపించారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు.
''మునుగోడులో పలుమార్లు నా కాన్వాయ్‌పై దాడికి యత్నించారు. పలివెలలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రచారాన్ని అడ్డుకున్నారు. కేంద్రమంత్రిని అడ్డుకుంటుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది. పలివెలలో ప్రచారం చేస్తున్న నా సతీమణిని దూషించారు. భాజపా కార్యకర్తలపై రాళ్లు రువ్వి జెండా కర్రలతో కొట్టారు. నా గన్ మెన్లు లేకపోతే నా తలకు తీవ్ర గాయాలు అయ్యేవి. నా పీఆర్‌వో, గన్‌మెన్లకు గాయాలయ్యాయి. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి డీఎస్పీని కొట్టారు. నాపై ఈగ వాలినా కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు.'' -ఈటల రాజేందర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే