మిషన్ భగీరథ పనులు నాలుగున్నరేళ్ల నుంచి నత్తనడకన సాగుతున్నాయి. ట్యాంకుల అనుసంధానం, అంతర్గత గొట్టపు మార్గాల నిర్మాణం, ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేయడం వంటి పనుల్లో నకిరేకల్ నియోజకవర్గం వెనుకబడి ఉంది. ఇప్పటి వరకు 30 శాతం గ్రామాలకు మాత్రమే పూర్తిస్థాయిలో భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. పనుల్లో వెనుకబడి ఉన్నారని, వేగం పెంచాలని సమీక్షల్లో రాష్ట్ర ఉన్నతాధికారులు సూచిస్తున్నా.. పనులు నత్తనడకన సాగుతున్నాయని ప్రజాప్రతినిధులు గగ్గోలు పెడుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పనులు వేగాన్ని అందుకోవడం లేదు. వివిధ గ్రామాల్లో గొట్టపుమార్గాల కోసం సీసీరోడ్లు, మురుకాల్వలను ధ్వంసం చేశారు. వాటి పునర్నిర్మాణంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని సర్పంచులు ఆవేదన చెందుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఓవర్‌హెడ్ ట్యాంకులకు భగీరథ నీరిస్తున్నారు.
సామగ్రి మాయం కేసు ఏమైంది..?
నకిరేకల్ నియోజకవర్గంలో భగీరథ పనుల కోసం ప్రభుత్వం సరఫరా చేసిన రూ.70 లక్షల విలువైన గేట్‌వాల్వులు మాయమయ్యాయి. అయిటిపాములలోని ఆర్‌డబ్ల్యూఎస్ ప్లాంట్‌లో నిల్వచేసిన ఇవి చోరీకి గురయ్యాయి. ఏడాదిన్నరగా ఈ కేసు కొలిక్కిరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసినా సామగ్రి జాడలేదు. సామగ్రి, నిందితుల ఆచూకీ లభించడం లేదని పోలీసు కేసును మూసేసే దశలో ఉంది. రూ.లక్షల విలువైన సామగ్రి మాయంపై శాఖాపరమైన చర్యలు తీసుకోలేదు. భారీస్థాయిలో సామగ్రి మాయం కావడం కూడా భగీరథ పనుల్లో నియోజకవర్గం వెనుకబడేందుకు కారణం.
మిషన్ భగీరథలో నాసిరకం యంత్రాలు అమర్చడం వల్ల నీటి సరఫరాలో అంతరాయాలు కలుగుతున్నాయి, నా సొంత గ్రామానికి కూడా భగీరథ తాగునీరు రావడంలేదు, నియోజకవర్గంలో ఏ గ్రామంలో చూసినా ఇదే పరిస్థితి, అధికారులకు చెప్పినా ప్రయోజనం లేదు.
- ఇటీవల జడ్పీ సర్వసభ్య సమావేశంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య