నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కరోనా కారణంగా అనేక వ్యాపారాలు అటకెక్కాయి. ఇల్లు గడవని పేదలు కరోనా రక్షణ సామాగ్రి అమ్ముతూ ఎంతో కొంత ఉపాధి పొందుతున్నారు. పట్టణంలోని బంగారుగడ్డకు చెందిన సాయి అనే విద్యార్థి తుంగపాడు ఆదర్శ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం కరోనా వల్ల పాఠశాలలు నడవడం లేదు. కానీ ఆన్లైన్ విద్యాబోధన అందిస్తామని ఉపాధ్యాయులు చెప్పారు. ఆన్లైన్ తరగతులు వినేందుకు తన దగ్గర ఫోన్ లేదు. ఇంట్లో తల్లిదండ్రులకు కొనిచ్చే స్థోమత లేదు. ఎలాగైనా తను కష్టపడి పనిచేసి ఫోన్ కొనాలనుకున్నాడు. పదో తరగతి పాఠాలను ఆన్లైన్లో వినాలనుకున్నాడు.
ప్రస్తుతం పాఠశాల నడవట్లేదు. కానీ ఆన్లైన్లో పాఠాలు చెబుతున్నారు. నాకు చదువంటే చాలా ఇష్టం. అమ్మవాళ్లకు ఫోన్ కొనిచ్చే స్థోమత లేదు. అందుకే నేనే కష్టపడి ఫోన్ కొనుక్కోవాలనుకున్నా. అందుకోసమే మాస్కులు, శానిటైజర్లు అమ్ముతూ డబ్బులు సంపాదిస్తున్నా. – సాయి, విద్యార్థి
అనుకున్నదే తడవుగా... సాగర్ రోడ్ ఫ్లైఓవర్ వద్ద శానిటైజర్లు, మాస్కులు అమ్ముతున్నాడు. సాయి ఒక్కడే కాదు.. స్కూల్ బ్యాగులు విక్రయిస్తూ జీవనం సాగించే మరెంతో మంది కూడా మాస్కులు, శానిటైజర్లు అమ్ముతూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న కుటుంబ సభ్యులకు అండగా... పిల్లలు కూడా వ్యాపారాల్లో దిగడం గమనార్హం. ఇందులో ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల్లేక జీవనాధారం కోసం రోడ్లపై స్టాళ్లు పెట్టుకున్న వాళ్లూ ఉన్నారు.