Ministers on Munugode Bypoll Result: తెలంగాణ సమాజం తెరాస పక్షానే ఉందని మరోసారి రుజువైందని మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, భాజపా కుట్రలకు మధ్య జరిగిన పోరాటంలో తెరాస పక్షాన నిలిచిన మునుగోడు ప్రజలకు మంత్రి హరీశ్ ధన్యవాదాలు తెలిపారు. భాజపా అహంకారాన్ని మునుగోడు ప్రజలు అణచివేశారన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పునకు మునుగోడు ఫలితం నాంది పలికిందన్నారు.
భాజపా కేంద్ర నాయకత్వానికి కర్రు కాల్చి వాతపెట్టారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ప్రజలంతా భవిష్యత్తులో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు. సీపీఎం, సీపీఐ పార్టీలు మునుగోడులో ఇచ్చిన మద్దతుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. తెరాస గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తలకు మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలిపారు.