Buddavanam:ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధవనం అందుబాటులోకి రానుంది. రెండేళ్ల క్రితమే ప్రారంభించాల్సి ఉన్నా కరోనాతోపాటూ వివిధ కారణాల వల్ల ఆలస్యమైంది. శనివారం మంత్రి కేటీఆర్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. కృష్ణా నది ఒడ్డున ప్రసిద్ధ బౌద్ధ క్షేత్ర పర్వత ఆరామమైన నందికొండలో ‘బుద్ధవనం’ప్రాజెక్టును 274 ఎకరాల్లో అభివృద్ధి చేయాలని 2003లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీలంక నుంచి తెచ్చిన 27 అడుగుల ప్రతిమ అందరినీ ఆకర్షిస్తుంది. దేశంలోని బుద్ధగయ, సార్‌నాథ్, లుంబిని తదితర ప్రాంతాల్లో లేని విధంగా అన్ని ప్రతిమలను ఈ పార్కులో నెలకొల్పడం విశేషంగా నిలుస్తోంది.
ఇప్పటివరకు పార్కు అభివృద్ధికి దాదాపు 90 కోట్ల వరకు ఖర్చు చేశారు. మహాస్తూపంలో బంగారు వర్ణంలో బుద్ధుడి ప్రతిమతోపాటు, పైన డోమ్ సిద్ధమైంది. బుద్దుడి జీవితం తెలుసుకునే విధంగా మ్యూజియం ఏర్పాటు చేశారు. పెద్దలు, పిల్లలు సేదతీరేలా పార్కు నిర్మించారు. మొత్తం 8 సెగ్మెంట్లలో ఇప్పటికే స్తూపం పార్కు, జాతక పార్కు, బుద్ధచరిత్ర వనం, ధ్యానవనం, మహాస్తూపం పనులు పూర్తయ్యాయి. బుద్ధవనం ప్రారంభమైతే పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుందని... సందర్శకులకు మౌలిక వసతులు నెలకొల్పేందుకు పర్యాటకశాఖతో కలిసి పనిచేస్తున్నామని బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య వెల్లడించారు.