KTR Fires on Rajagopal Reddy: అక్రమ కాంట్రాక్టులతో సంపాదించిన రూ.వేల కోట్ల ధన బలంతో ఇన్నాళ్లు ప్రజలను పట్టించుకోని రాజగోపాల్‌రెడ్డే మునుగోడు ఉప ఎన్నిక తీసుకొచ్చారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. మనుగోడులో ప్రచారం నిర్వహిస్తున్న తెరాస నేతలు, ముఖ్య కార్యకర్తలతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజగోపాల్‌రెడ్డి ధన బలానికి.. మునుగోడు ప్రజల బలానికి మధ్య మునుగోడు ఎన్నిక జరుగుతోందని కేటీఆర్ అన్నారు. రాజగోపాల్‌రెడ్డి రూ.వేల కోట్ల కాంట్రాక్టుల దాహం వల్లే ఉపఎన్నిక వచ్చిందన్న విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నాలుగేళ్లుగా మునుగోడును పూర్తి నిర్లక్ష్యం చేసి.. అట్టర్ ఫ్లాప్ ఎమ్మెల్యేగా నిలిచారని కేటీఆర్ ధ్వజమెత్తారు. రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని, ప్రజల కష్టసుఖాలను ఏ మాత్రం పట్టించుకోకుండా కేవలం తన కాంట్రాక్టులనే ఆలోచించే ఫక్తు రాజకీయ వ్యాపారి అని ఆరోపించారు. అసెంబ్లీలో కూడా నియోజకవర్గ సమస్యలను వదిలేసి కాంట్రాక్టర్ల బిల్లులపై మాట్లాడారని ఆరోపించారు. రూ.వేల కోట్ల కాంట్రాక్టు కోసమే రాజగోపాల్ రెడ్డి భాజపాలో చేరారన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు గతంలో అనేక హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా చేతులెత్తేసిన రాజగోపాల్ రెడ్డి.. ఇప్పుడు మళ్లీ ప్రజలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
భాజపా ఇచ్చిన రూ.వేల కోట్ల కాంట్రాక్టు కమీషన్ డబ్బులతో బైకులు, కార్లతో పాటు ఇతర విలువైన వస్తువులను ఓటర్లకు రాజగోపాల్ రెడ్డి పంచుతున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. పదవీ కాలం మరో ఏడాది ఉన్నప్పటికీ.. తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉప ఎన్నిక తెచ్చిన రాజగోపాల్ రెడ్డికి.. చైతన్యవంతులైన మునుగోడు ఓటర్లు భాజపాకు, రాజగోపాల్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి వైఫల్యాలు, కాంట్రాక్టులను వివరిస్తూనే.. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లో ప్రచారం చేయాలని కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు.