తెలంగాణ

telangana

ETV Bharat / state

మునుగోడు అభ్యర్థిత్వంపై తెరాసలో విభేదాలు.. మంత్రి జగదీశ్‌రెడ్డి బుజ్జగింపులు - మునుగోడు ఉప ఎన్నిక తాజా వార్తలు

TRS Leaders on Munugode By Election: మునుగోడు ఉపఎన్నికలో పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేసేలా తెరాస కసరత్తు చేస్తోంది. అభ్యర్థి విషయంలో నియోజకవర్గ నాయకుల్లో విభేదాలు కనిపించడంతో తెరాస నాయకత్వం అప్రమత్తమైంది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వానికే మొగ్గు చూపుతున్నట్లు పార్టీ ముఖ్య నేతలు సంకేతాలు ఇవ్వడంతో.. పార్టీ వర్గాల్లో ఏర్పడిన అలజడిని సద్దుమణిగేలా చర్యలు చేపట్టింది. స్థానిక ప్రజాప్రతినిధులతో మంత్రి జగదీశ్‌రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. అసంతృప్తులు, అసమ్మతులు ఎవరూ లేరని.. కేసీఆర్ ఖరారు చేసిన అభ్యర్థిని గెలిపించేందుకు నాయకులందరూ సిద్ధంగా ఉన్నారని మంత్రి వెల్లడించారు.

మునుగోడు
మునుగోడు

By

Published : Aug 11, 2022, 8:48 AM IST

మునుగోడు అభ్యర్థిత్వంపై తెరాసలో విభేదాలు.. మంత్రి జగదీశ్‌రెడ్డి బుజ్జగింపులు

TRS Leaders on Munugode By Election: మునుగోడు ఉపఎన్నికపై పార్టీ శ్రేణులను తెరాస పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తోంది. అందరినీ ఏకతాటిపై నడిపించి భారీ విజయం నమోదు చేసేలా కసరత్తు చేస్తోంది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ప్రధానంగా టికెట్ రేసులో ఉన్నారు. నియోజకవర్గం పరిధిలోని పలువురు జడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్మన్లు కూడా అవకాశం ఆశిస్తున్నారు.

అయితే మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గం ఇంఛార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వానికే పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతోందని ప్రచారం జరుగుతుండటంతో.. స్థానిక నాయకుల్లో అలజడి చెలరేగింది. ఉపఎన్నిక సంకేతాలు వచ్చినప్పటి నుంచే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని మంత్రి జగదీశ్‌రెడ్డి ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ ఇటీవల 12 మంది ప్రజా ప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు లేఖ రాసినట్లు సమాచారం.

కూసుకుంట్ల బరిలోకి దిగితే తాము పనిచేసేది లేదంటూ నియోజకవర్గంలో కొందరు స్థానిక నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. నియోజకవర్గంలోని పార్టీ శ్రేణుల్లో నెలకొన్న గందరగోళానికి తెరదించాలని మంత్రి జగదీశ్‌రెడ్డికి సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

కేసీఆర్ ఆదేశాల మేరకు మునుగోడు నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులతో మంత్రి జగదీశ్‌రెడ్డి నిన్న హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. మంత్రుల నివాస సముదాయంలోని తన ఇంట్లో సుమారు పది గంటల పాటు స్థానిక నేతలతో మంత్రి చర్చించారు. మండలాలు, మున్సిపాల్టీల వారీగా నాయకులతో వివిధ అంశాలపై మాట్లాడారు. పార్టీ ఖరారు చేసిన అభ్యర్థిని అందరూ కలిపి గెలిపించాలని కోరారు.

ప్రభుత్వం, తెరాసపై నియోజకవర్గ ప్రజల్లో సానుకూల స్పందన ఉందని.. అంతా కలిసి పనిచేస్తే భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని చెప్పారు. నాయకులు టికెట్ ఆశించడంలో తప్పు లేదని.. అయితే కేసీఆర్ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని చెప్పారు. నాయకత్వం అభ్యర్థిని ప్రకటించిన తర్వాత.. అభ్యంతరాలు ఏవైనా ఉంటే చర్చించి పరిష్కరించుకోవచ్చునని సూచించినట్లు సమాచారం.

పార్టీ కోసం పని చేసిన వారందరికీ తగిన సమయంలో అవకాశాలు వస్తుంటాయని... ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో పాటు గుత్తా సుఖేందర్ రెడ్డి, కర్నె ప్రభాకర్, బూర నర్సయ్య గౌడ్ సమావేశానికి హాజరు కాలేదు. ఆశావహులెవరినీ పిలవలేదని.. కేవలం ప్రజాప్రతినిధులతో చర్చించామని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు.

తన నివాసంలో సమావేశం అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి నాయకులతో కలిసి ప్రగతిభవన్ వెళ్లారు. సీఎం కేసీఆర్‌ను కలవాలని భావించినప్పటికీ.. మంత్రి జగదీశ్‌రెడ్డి , జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్, జిల్లా ఇంచార్జి తక్కెళ్ల రవీందర్ రావు పార్టీ నాయకులతో మాట్లాడారు. మునుగోడులో తెరాస నాయకులందరూ ఐక్యంగానే ఉన్నారని.. అసంతృప్తులు, అసమ్మతులు లేరని మంత్రి పేర్కొన్నారు. అభ్యర్థిని సీఎం కేసీఆర్ నిర్ణయిస్తారని .. ప్రస్తుతానికి తెరాస పార్టీ, కారు గుర్తే తమ అభ్యర్థి అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా విఫలమయ్యారని.. తన స్వార్థం, కుటుంబ అభివృద్ధి కోసమే ఉపఎన్నికలు తీసుకొచ్చారని ప్రజలకు వివరిస్తామన్నారు.

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వానికి అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ.. కాంగ్రెస్ అభ్యర్థి, ఎన్నికల నోటిఫికేషన్‌పై స్పష్టత వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు.. స్వలాభం కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారన్న ప్రచారాస్త్రాలతో తెరాస రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. త్వరలో కేసీఆర్, కేటీఆర్ ప్రచార వ్యూహాలను ఖరారు చేయనున్నారు. ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలందరూ మునుగోడులో మొహరించనున్నారు.

"ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశమై చర్చించాం. మునుగోడు తెరాసలో ఎలాంటి అసంతృప్తులు లేవు. సీఎం ఎవరిని అభ్యర్థిగా నిలిపినా గెలిపిస్తాం. రాజగోపాల్‌ రెడ్డి స్వార్థం కోసమే ఈ ఉపఎన్నిక వస్తోంది. సీఎం కేసీఆర్‌ మిషన్‌ భగీరథను తీసుకొచ్చి ఫ్లోరోసిస్‌ సమస్యను తరిమికొట్టారు. పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తాం." - జగదీశ్​రెడ్డి విద్యుత్ శాఖ మంత్రి

ఇవీ చదవండి:Etela Rajender: నాపై అలాంటి వార్తలు రావడాన్ని ఖండిస్తున్నా: ఈటల

'పాక్​కు రూ.55 కోట్లు ఇప్పించేందుకు గాంధీ దీక్ష!'.. నిజమెంత?

ABOUT THE AUTHOR

...view details