సాగర్ అభివృద్ధిపై జానారెడ్డితో బహిరంగచర్చకు తాను సిద్ధమని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. జానారెడ్డి ఎమ్మెల్యే, మంత్రి అయిన కాలం.. తెరాస పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలో జరిగిన అభివృద్ధిపై తాను చర్చకు ఎక్కడికైనా వస్తానన్నారు. తెరాస కార్యకర్తలైనా చర్చకు వస్తారని స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని హాలియలోని ఓ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేశారు.
సాగర్ అభివృద్ధిపై బహిరంగచర్చకు సిద్ధం: మంత్రి జగదీశ్ రెడ్డి
నాగార్జునసాగర్ ఉపఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అధికార తెరాస, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటలు ముదురుతున్నాయి. నాగార్జునసాగర్ నియోజకవర్గ తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని హాలియలో నిర్వహించారు. జానారెడ్డితో సాగర్ అభివృద్ధిపై బహిరంగచర్చకు తాను సిద్ధమని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
జానారెడ్డి ఈ మధ్య కాలంలో చాలా గట్టిగా మాట్లాడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. జానారెడ్డి అభివృద్ధి చేస్తే సాగర్ ప్రజలు 2018 ఎన్నికల్లో ఆయనను ఎందుకు పక్కన పెట్టారో తెలపాలని డిమాండ్ చేశారు. జానారెడ్డి ఇంకా తానే ఎమ్మెల్యే అనే భ్రమలో ఉన్నారన్నారు. సాగర్ ఉపఎన్నికల్లో ఓటర్లు తెరాసకు పట్టం కట్టనున్నారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, నియోజకవర్గ ఇంఛార్జీలు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష