కరోనా నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడంపై అవగాహన పెంచుకున్న ప్రజలు... మాంసాహారంపై అధిక దృష్టి సారించారు. ఇదే అదనుగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ పురపాలికలో మాంసం వ్యాపారులు ఎటువంటి నిబంధనలు పాటించకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.
చనిపోయిన జీవాల మాంసం...
మున్సిపాలిటీలో కొంత మంది వ్యాపారులు చనిపోయి, రోగాల బారిన పడిన జీవాల్ని సైతం కోసి విక్రయిస్తున్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. బర్డ్ ఫ్లూ భయంతో కోడి మాంసం తినేందుకు భయపడి... మటన్ వైపు మొగ్గు చూపడంతో ఎటువంటి నియంత్రణ లేకుండా మాంసం ధరలు పెంచి విక్రయిస్తున్నారు.
భారీగా పెంచిన ధరలు...
కరోనా మహమ్మారికి ముందు మటన్ కిలో ధర రూ.500 వరకు ఉండేది. కానీ ప్రస్తుతం దాని ధర రూ.800 వరకు పెంచారు. ఇంత ధర పెట్టి మాంసాన్ని కొన్నా... అది మంచిదో కాదో నమ్మకం లేదని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో లక్షల సంఖ్యలో జీవాలు ఉన్నప్పటికీ మాంసం ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు.
"ఇకనైనా పురపాలిక అధికారులు మేల్కోవాలి. పట్టణంలో నిరుపయోగంగా ఉన్న స్లాటర్ హౌస్‌ను వినియోగంలోకి తేవాలి. వ్యాపారులు నాణ్యమైన మాంసాన్ని విక్రయించేలా చూసి... ధరల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలి." ------ బాలాజీ, వినియోగదారుడు, మిర్యాలగూడ పట్టణం. |
రూ.84 కోట్ల వ్యాపారం..
జిల్లాలో మొత్తం జీవాల సంఖ్య దాదాపు 14.5 లక్షలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఏటా వాటి ఉత్పత్తి 21లక్షల వరకు ఉంటుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 12 లక్షల కిలోల మాంసం విక్రయిస్తున్నారని అన్నారు. మొత్తం మాంసం విక్రయం ద్వారా సుమారు రూ.84 కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
మాంసం విక్రయానికి ప్రభుత్వ నిబంధనలు... పురపాలికల్లో మాంసం విక్రయించేందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. వాటికి అనుగుణంగా మాంసం విక్రయించాల్సి ఉన్నప్పటికీ... అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గాలికొదిలేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. |